10th Class Exams : తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 మార్చి 18 నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పాఠశాల విద్యాశాఖ అధికారులు ఈ తేదీలను దాదాపు ఖరారు చేశారు. ఈ సారి ప్రతి సబ్జెక్టు పరీక్ష మధ్య కనీసం 1 నుండి 2 రోజుల వ్యవధి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2-3 రకాల షెడ్యూల్స్‌ను సిద్ధం చేస్తున్నారు. దీని వల్ల అధికారిక ప్రకటనలో కొంత ఆలస్యం జరుగుతోంది.
విద్యార్థులపై మానసిక ఒత్తిడి తగ్గించే ఉద్దేశంతో సీబీఎస్‌ఈ బోర్డు తరహాలో పరీక్షల మధ్య వ్యవధి ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. గత ఏడాది కొన్ని పరీక్షల మధ్య ఒక్క రోజు కూడా గ్యాప్ లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. నిపుణులు కూడా పరీక్షల మధ్య తగిన వ్యవధి ఉండాలని సూచిస్తున్నారు.
పరీక్షలను త్వరగా ముగించడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని కొందరు అభిప్రాయపడుతున్నా, మరికొందరు నిపుణులు 1-2 రోజుల గ్యాప్ ఉంటే విద్యార్థులు ప్రశాంతంగా సన్నద్ధం కాగలరని చెబుతున్నారు. సీబీఎస్‌ఈలో ఉన్నట్లు వారం రోజుల వ్యవధి అవసరం లేకపోయినా, కనీసం రెండు రోజుల గ్యాప్ ఉంటే సరిపోతుందని వారు సూచిస్తున్నారు.

