8Th Pay Commission : కేంద్ర ప్రభుత్వం గత నెలలో ఎనిమిదో వేతన సంఘం కోసం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (TOR) విడుదల చేయడంతో ఉద్యోగుల్లో జీతాల పెంపు, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ గురించి ఆసక్తి భారీగా పెరిగింది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంటే పాత బేసిక్ పేని కొత్త బేసిక్ పేగా మార్చే గుణకం. ఏడవ వేతన సంఘంలో ఇది 2.57గా నిర్ణయించగా, ఎనిమిదో వేతన సంఘంలో ఎంత ఉంటుందనేది ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ద్రవ్యోల్బణం, వస్తు ధరలు, గృహ అద్దెలు, కుటుంబ ఖర్చులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ఫ్యాక్టర్‌ను నిర్ణయిస్తారు.
ఇటీవలి కొన్ని నివేదికల (ఆంబిట్ క్యాపిటల్ వంటివి) ప్రకారం ఎనిమిదో వేతన సంఘం ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను 1.83 నుంచి 2.46 మధ్య నిర్ణయించే అవకాశం ఉంది. ప్రస్తుతం ₹18,000 బేసిక్ పే ఉన్న ఉద్యోగికి 1.83 ఫ్యాక్టర్ వస్తే కొత్త బేసిక్ ₹32,940 అయితే, 2.46 వస్తే ₹44,280 వరకు పెరుగుతుంది. అంటే కనీస వేతనంలో 14% నుంచి 54% వరకు పెరగవచ్చు. అయితే ఇంత ఎక్కువ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అమలైతే ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం పడే అవకాశం ఉంది.
జస్టిస్ రంజనా ప్రకాష్ దేశ్ నాయకత్వంలోని ఈ వేతన సంఘం సిఫారసులు సుమారు 18 నెలల తర్వాత (2026 చివరి లేదా 2027 ప్రారంభంలో) అమలు కావచ్చు. కేబినెట్ ఆమోదం తర్వాత 50 లక్షల కేంద్ర ఉద్యోగులు, 65 లక్షల పెన్షనర్లకు ఈ పెంపు వర్తిస్తుంది. బేసిక్ పే, గ్రేడ్ పే, ఇతర భత్యాల్లో కూడా మార్పులు రావడం ఖాయం.

