Akhanda 2 Movie : నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరక్షన్‌లో రానున్న సూపర్ అక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2 తాండవం’ సినిమాకు రిలీజ్ ముందు పెద్ద ఆటంకం తగిలింది. తాజాగా మద్రాస్ హైకోర్టు ఈ సినిమా విడుదలను, వాణిజ్య ఉపయోగాన్ని (కమర్షియల్ ఎక్స్‌ప్లాయిటేషన్) పూర్తిగా ఆపేసేలా స్టే ఆర్డర్ జారీ చేసింది. దీంతో డిసెంబర్ 5న జరగనున్న గ్రాండ్ రిలీజ్ ప్లాన్‌లు ఆలస్యం కావచ్చు. బాలయ్య ఫ్యాన్స్ ఈ వార్తతో షాక్‌లో మునిగారు.
ఈ సినిమా బాలకృష్ణకు మొదటి పాన్-ఇండియా ప్రాజెక్ట్‌గా ప్రచారం చేస్తూ, తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, అవధి తదితర భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. 2021లో విడుదలైన ‘అఖండ’ సూపర్ హిట్‌గా నిలిచిన నేపథ్యంలో ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ, రిలీజ్‌కు రెండు రోజుల ముందే ఈ లీగల్ ఇష్యూ తలెత్తడంతో మేకర్స్ కూడా ఆందోళనలో ఉన్నారు.
వివాదం వెనుక కారణం ఏమిటి ?
ఈరోస్ కంపెనీ ప్రకారం, ‘అఖండ 2’ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్ (మునుపటి 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు అనుబంధం) తమకు 28 కోట్ల రూపాయల చెల్లింపు చేయాల్సి ఉంది. ఇది మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘వన్ – నేనొక్కడినే’ మరియు ‘ఆగడు’ సినిమాలకు సంబంధించిన అర్బిట్రేషన్ అవార్డ్ నష్టాలు. ఈరోస్ ఇంటర్నేషనల్ 2019లో ఈ సినిమాల ఓవర్సీస్ రైట్స్ కొనుగోలు చేసింది, కానీ నిర్మాణ సంస్థ చెల్లింపులు చేయకపోవడంతో కోర్టుకు వెళ్లారు. ఇప్పుడు కొత్త ఎంటిటీ పేరుతో ‘అఖండ 2’ రిలీజ్ చేస్తూ, చెల్లింపు మాన్డలను తప్పించుకుంటున్నారని ఆరోపణ. ఈ పిటిషన్ వివరాల ప్రకారం, హైకోర్టు జస్టిస్ ఆనంద్ వెంకటేష్ ఆదేశాల మేరకు సినిమా విడుదల, డిస్ట్రిబ్యూషన్, స్ట్రీమింగ్ లేదా ఏ థర్డ్ పార్టీ రైట్స్ కేటాయింపుకు సర్వత్ర స్టే ఇచ్చారు. ఇది తమిళనాడు మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా రిలీజ్‌ను ప్రభావితం చేస్తుందా అనేది ఇంకా క్లారిటీ రావాలి.

