putin india visit : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల అధికారిక భారత పర్యటన నిమిత్తం బుధవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. 23వ భారత-రష్యా ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టారు. గురువారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అధికారిక స్వాగత కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలు పుతిన్‌కు ఘనంగా స్వాగతం పలికారు. ఇరు దేశాల ఉన్నతాధికారులు, మంత్రులను నేతలు పరస్పరం పరిచయం చేసుకున్నారు.
టెక్నికల్ ఏరియాలోని విమానాశ్రయానికి చేరుకున్న పుతిన్‌ను ప్రధాని మోదీ వ్యక్తిగతంగా వెళ్లి ఆప్యాయంగా స్వాగతం పలికారు. అనంతరం మోదీ తన నివాసంలో పుతిన్ గౌరవార్థం ప్రైవేట్ విందు ఏర్పాటు చేశారు.
ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీ – అధ్యక్షుడు పుతిన్ మధ్య ఒకరితో ఒకరు (one-on-one) మరియు ప్రతినిధి బృందం స్థాయి అధికారిక చర్చలు జరగనున్నాయి. రక్షణ రంగ సహకారం, ఇంధన భద్రత, అణు ఇంధనం, వాణిజ్యం-పెట్టుబడులు, ప్రాంతీయ & ప్రపంచ భద్రతా పరిస్థితులు, దీర్ఘకాలిక ఆర్థిక భాగస్వామ్యం తదితర కీలక అంశాలపై లోతైన చర్చలు జరుగనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. చర్చల అనంతరం ఇరు నేతలు సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడనున్నారు. ఆ తర్వాత భారత-రష్యా వ్యాపార సముదాయాల మధ్య జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో పుతిన్ పాల్గొంటారు. సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే రాష్ట్ర విందులోనూ ఆయన పాల్గొంటారు. కోవిడ్ తర్వాత పుతిన్ రెండోసారి భారత్‌ను సందర్శిస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఈ పర్యటనకు అంతర్జాతీయంగా ప్రాధాన్యత ఏర్పడింది.

