Rythu Bharosa : యాసంగి (రబీ) సీజన్ ప్రారంభమైనా… రైతు భరోసా (పెట్టుబడి సాయం)పై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వకపోవడంతో జిల్లా రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వానాకాలంలో అధిక వర్షాలతో పంటలు దెబ్బతినడంతో సాగు ఖర్చులకు తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించలేకపోయిన రైతులు… ఇప్పుడు కొత్త సీజన్ కోసం చేతికి డబ్బు లేక ప్రైవేటు వడ్డీ వ్యాపారుల గుప్పెట్లో పడకుండా ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
గత వానాకాలం సీజన్లో జిల్లాలో 2,17,606 మంది రైతులకు రూ. 216 కోట్ల రైతు భరోసా అందించినా… అధిక వర్షాలతో పంటలు పూర్తిగా నష్టపోయాయి. దీంతో రైతుల ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించినట్టు ఎకరాకు రూ.15 వేలు (రెండు సీజన్లకు కలిపి) ఇవ్వాల్సి ఉండగా… బడ్జెట్ ఇబ్బందుల కారణంగా రూ.12 వేలకు తగ్గించిన విషయం తెలిసిందే.
యాసంగిలో 3.95 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం
వ్యవసాయ శాఖ అధికారులు ఈ యాసంగి సీజన్లో జిల్లాలో మొత్తం 3,95,555 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేశారు. ఇందులో వరి పంట 3,02,600 ఎకరాలు, మొక్కజొన్న 35,000 ఎకరాలు, మామిడి 38,300 ఎకరాలు, నువ్వులు 11,000 ఎకరాలు, ఆయిల్ పామ్ 4,200 ఎకరాలు, ఇతర పంటలు మిగతా విస్తీర్ణంలో సాగవుతాయని తెలిపారు. 10 నుంచి 20 శాతం వరకు హెచ్చు తగ్గులు ఉండవచ్చని అంచనా.
ఎరువులు – విత్తనాల అవసరం
సీజన్ కోసం యూరియా 39,100 టన్నులు, డీఏపీ 16,219 టన్నులు, కాంప్లెక్స్ 36,000 టన్నులు, పొటాష్ 8,148 టన్నులు, సూపర్ 5,231 టన్నులతోపాటు వరి విత్తనం 75,750 క్వింటాళ్లు, మొక్కజొన్న 2,176 క్వింటాళ్లు తదితర విత్తనాలు అవసరమవుతాయని అధికారులు పేర్కొన్నారు. ఈ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎరువులు, విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు.
రైతుల ఆవేదన
జిల్లాలో మొత్తం 2,48,550 మంది రైతులు ఉండగా… వీరిలో 1,79,866 మంది రెండున్నర ఎకరాల లోపు చిన్న రైతులే. వీరు పూర్తిగా రైతు భరోసా సాయంపైనే ఆధారపడి ఉంటారు. “ప్రభుత్వం త్వరగా రైతు భరోసా విడుదల చేయాలి. లేకపోతే ప్రైవేటు వడ్డీ వ్యాపారుల చేతుల్లో పడి మరింత నష్టపోతాం” అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

