Rammohan Naidu : పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే దేశంలో అతిపెద్ద ఎయిర్‌లైన్స్ అయిన ఇండిగోలో తలెత్తిన తీవ్ర సంక్షోభం (విమానాల రద్దు, జాప్యం, టికెట్ల ధరల పెంపు)పై జాతీయ మీడియా అగ్గిమీద గుగ్గిలమవుతోంది. సంక్షోభాన్ని పరిష్కరించడంలో మంత్రిత్వ శాఖ ఘోరాతి ఘోరంగా విఫలమైందంటూ జాతీయ ఛానెళ్లు, పత్రికలు తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నాయి.
ఈ సంక్షోభంపై అత్యంత ఘాటుగా స్పందించిన రిపబ్లిక్ టీవీ ప్రెజెంటర్ ఆర్నాబ్ గోస్వామి తన ప్రైమ్‌టైమ్ చర్చా కార్యక్రమంలో మంత్రి వైఖరిని నిలదీశారు. “ఇంత పెద్ద జాతీయ సంక్షోభం తలెత్తితే మంత్రి ఏం చేస్తున్నారు? నెట్ ప్రాక్టీస్ చేస్తున్నారా? లేక రీల్స్ వీడియోలు చేస్తున్నారా? ప్రయాణికులు విమానాశ్రయాల్లో పడిగాపులు కాస్తున్నారు, వారి కష్టాలు విమానయాన మంత్రికి పట్టడం లేదా?” అంటూ ఆయన నేరుగా ప్రశ్నల వర్షం కురిపించారు.
ఈ చర్చల సందర్భంగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రతినిధులు చేసిన కొన్ని వ్యాఖ్యలు పరిస్థితిని మరింత హాస్యాస్పదంగా మార్చాయి. రిపబ్లిక్ టీవీ చర్చలో పాల్గొన్న టీడీపీ నేత దీపక్ రెడ్డి మాట్లాడుతూ.. “ఈ సంక్షోభ పరిస్థితిని నారా లోకేశ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు… ఇందుకోసం ప్రత్యేకంగా వార్‌రూమ్‌ని కూడా ఏర్పాటుచేశారు” అని పేర్కొన్నారు. కేంద్ర పౌర విమానయాన సంక్షోభాన్ని కేంద్ర మంత్రితో కాకుండా రాష్ట్ర స్థాయి నేత పర్యవేక్షించడం ఏమిటంటూ జాతీయ మీడియా, సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్ర మంత్రి శాఖ నిర్వహణకు లోకేశ్ పర్యవేక్షణ అవసరమా అంటూ ప్రతిపక్షాలు సైతం దుయ్యబట్టాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో, రామ్మోహన్ నాయుడు తన మంత్రిత్వ శాఖపై, ముఖ్యంగా ఇండిగో వంటి అతిపెద్ద విమానయాన సంస్థపై తన పట్టును నిరూపించుకోవాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది.

