AI : సాంకేతికత ప్రపంచంలో కృత్రిమ మేధస్సు (AI) రోజురోజుకూ మన జీవితాల్లో లోతుగా చేరుతోంది. ఇది ఒకవైపు ఉద్యోగాలకు ముప్పుగా మారుతుంటే, మరోవైపు మానవ జీవితాలను కాపాడేలా మారుతోంది. ఇటీవల నార్వేలో జరిగిన ఒక సంఘటన దీనికి ప్రబలమైన ఉదాహరణ. 49 ఏళ్ల వ్యక్తి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నప్పుడు, వైద్యులు దానిని సాధారణ ఎసిడిటీగా భావించి ఇంటికి పంపేశారు. కానీ, ఎలాన్ మస్క్ యొక్క xAI కంపెనీ అభివృద్ధి చేసిన గ్రాక్ AI కేవలం కొన్ని నిమిషాల్లోనే అపెండిక్స్ పగిలిపోయే ప్రమాదాన్ని గుర్తించి, అతని ప్రాణాన్ని కాపాడింది.
49 ఏళ్ల వ్యక్తి, 24 గంటల పాటు కడుపు తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడు. జ్వరం లేకపోయినా, నొప్పి భరించలేనంతగా తీవ్రంగా ఉంది. అత్యవసర ఆసుపత్రికి (ER) చేరుకున్న ఆయనకు, డాక్టర్లు కడుపును కొద్దిగా నొక్కి చూసి, దీన్ని సాధారణ ‘గ్యాస్-ఎసిడిటీ’గా భావించారు. ఎసిడిటీ బ్లాకర్ మందులు ఇచ్చి, ఇంటికి పంపేశారు. కానీ, మందులతో నొప్పి తగ్గకపోవటంతో, ఆయన మరింత బాధలో పడ్డాడు. కదలలేకపోయి పడుకున్న ఆయన, విసిగిపోయి తన గ్రోక్ AI చాట్‌ను తెరిచాడు.
గ్రోక్ AIకి తన లక్షణాలను వివరించిన ఆయనకు, AI కేవలం కొన్ని నిమిషాల్లోనే బదులిచ్చింది. “ఇది అల్సర్ లేదా అపెండిక్స్ సమస్య కావచ్చు. ఇది ‘రెడ్-ఫ్లాగ్’ ప్యాటర్న్ – తీవ్రమైన అటిపికల్ అపెండికైటిస్ (atypical appendicitis) సూచనలు ఉన్నాయి” అని హెచ్చరించింది. వెంటనే తిరిగి ఆసుపత్రికి వెళ్లి, సిటీ స్కాన్ (CT Scan) చేయించుకోవాలని సలహా ఇచ్చింది. ఈ సలహా ఆయన జీవితాన్ని మార్చేసింది.
AI సలహాను డాక్టర్లకు చెప్పకుండా, తన సోదరి ఒక నర్స్ అని, ఆమె స్కాన్ చేయమని చెప్పిందని అబద్ధం చెప్పాడు. చివరకు సిటీ స్కాన్‌లో స్పష్టంగా తేలింది – ఇది సాధారణ ఎసిడిటీ కాదు, పగిలిపోయే దశలో ఉన్న వాపు వచ్చిన అపెండిక్స్! ఆరు గంటల్లోనే శస్త్రచికిత్స చేసి, అపెండిక్స్‌ను తొలగించారు. శస్త్రచికిత్స తర్వాత, నొప్పి పూర్తిగా తగ్గి, ఆయన ఆరోగ్యం మెరుగుపడింది. ఈ సంఘటన, AI యొక్క శక్తిని మరింత స్పష్టం చేస్తోంది. వైద్యులు రోజువారీ ఒత్తిడిలో, చిన్న చిన్న లక్షణాలను మిస్ అవుతారు. కానీ, గ్రోక్ వంటి AIలు, పెద్ద డేటా సెట్‌లతో విశ్లేషణ చేసి, త్వరగా డయాగ్నోస్ చేయగలవు. అయితే, AI సలహాలు డాక్టర్ సలహాను భర్తీ చేయలేవు – ఇవి సప్లిమెంట్‌గా ఉపయోగపడతాయి.

