Intermediate exam postponed : హోలీ పండుగ సందర్భంగా తెలంగాణలో మార్చి 3న జరగాల్సిన ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సర (సెకండియర్) పరీక్షను మార్చి 4కు వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు త్వరలోనే విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మిగతా అన్ని పరీక్షలు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయని స్పష్టం చేశారు.
మార్చి 3న హోలీ పండుగ సెలవు దినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో, అదే రోజున నిర్వహించాల్సిన సెకండియర్ పరీక్షను మరుసటి రోజుకు మార్చాల్సి వచ్చిందని ఇంటర్ బోర్డు వర్గాలు వెల్లడించాయి. మొదట మార్చి 4న హోలీ పండుగ ఉంటుందని భావించిన అధికారులు ఆ రోజున సెలవు ఇచ్చారు. అయితే, ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన సెలవుల జాబితాలో మార్చి 3నే హోలీగా ప్రకటించడంతో షెడ్యూల్లో ఈ మార్పు చేయాల్సి వచ్చింది.
ఇదిలా ఉండగా, తెలంగాణ ఇంటర్మీడియెట్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 25న ఫస్ట్ ఇయర్, 26న సెకండ్ ఇయర్ పరీక్షలు మొదలవుతాయి. సబ్జెక్టుల వారీగా పూర్తి షెడ్యూల్ను ఇప్పటికే ఇంటర్ బోర్డు విడుదల చేసింది. అన్ని పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని అధికారులు తెలిపారు. విద్యార్థులు తాజా మార్పును గమనించి, పరీక్షలకు సన్నద్ధం కావాలని ఇంటర్ బోర్డు సూచించింది.

