National Herald Case : నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీ హైకోర్టు కీలక నోటీసులు జారీ చేసింది. మనీలాండరింగ్ ఆరోపణలతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకోవడానికి ట్రయల్ కోర్టు నిరాకరించడాన్ని ఈడీ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఈ కేసులోని ఇతర నిందితులకు నోటీసులు జారీ చేసింది.
నేషనల్ హెరాల్డ్ పత్రికను నిర్వహించే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) సంస్థకు కాంగ్రెస్ పార్టీ సుమారు రూ.90 కోట్ల రుణం ఇచ్చిన విషయం తెలిసిందే. అనంతరం ఆ రుణాన్ని వసూలు చేయడం పేరిట ఏజేఎల్‌కు చెందిన విలువైన ఆస్తులు తమ ఆధీనంలోకి వెళ్లినట్లుగా ఈడీ ఆరోపిస్తోంది.
ఈడీ ఛార్జ్‌షీట్ ప్రకారం, ఏజేఎల్‌కు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకున్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రధాన వాటాదారులుగా ఉన్నారు. ఈ సంస్థ కేవలం రూ.50 లక్షలు మాత్రమే చెల్లించి ఏజేఎల్‌కు చెందిన సుమారు రూ.2 వేల కోట్ల విలువైన ఆస్తులను పొందిందని ఈడీ పేర్కొంది.
ఈ వ్యవహారంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండేజ్, సుమన్ దూబే తదితరులు మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఈడీ ఆరోపణలు చేసింది. అక్రమంగా ఆస్తులు బదిలీ చేసి ఆర్థిక లాభాలు పొందినట్లు దర్యాప్తు సంస్థ తన ఛార్జ్‌షీట్‌లో వివరించింది.
అయితే, ట్రయల్ కోర్టు ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను స్వీకరించడానికి నిరాకరించడంతో ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. ఈడీ పిటిషన్‌ను ప్రాథమికంగా విచారించిన ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసి, నిందితుల స్పందన కోరింది.
ఈ కేసు రాజకీయంగా తీవ్ర ప్రాధాన్యం సంతరించుకోవడంతో పాటు, దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. హైకోర్టు తదుపరి విచారణలో ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

