Ration Card Subsidy : సంక్రాంతి, న్యూ ఇయర్ పండగల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారులకు శుభవార్త తెలిపింది. ఇకపై రేషన్ దుకాణాల్లో బియ్యం తదితర నిత్యావసరాలతో పాటు గోధుమ పిండిని కూడా కేవలం రూ.20కే కేజీకి అందించనుంది. బహిరంగ మార్కెట్‌లో ప్రస్తుతం గోధుమ పిండి ధర రూ.40 నుంచి రూ.80 వరకు ఉండగా, ప్రజలకు భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా గోధుమ వినియోగాన్ని ప్రోత్సహించాలన్న కేంద్ర ప్రభుత్వ విధానానికి అనుగుణంగా కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఈ పథకం జనవరి 1వ తేదీ నుంచి రేషన్ షాపుల్లో అధికారికంగా ప్రారంభం కానుంది.
మొదటి దశలో జిల్లా కేంద్రాలు, పట్టణాలు, నగరాల్లో ఈ పథకాన్ని అమలు చేసి, ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాలకు విస్తరించనున్నారు. అయితే జనవరిలో పంపిణీ చేయనున్న గోధుమ పిండి సరుకులను ఈ నెల 26 నుంచే ముందుగానే రేషన్ షాపులకు సరఫరా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో సరుకులు చేరగా, డిమాండ్‌ను బట్టి మరిన్ని సరుకులు పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

