Shah Rukh Khan in Jailer 2 : సూపర్‌స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘జైలర్’ విజయంతో, దాని సీక్వెల్ ‘జైలర్ 2’పై అంచనాలు భారీగా పెరిగాయి. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మరింత గ్రాండ్‌గా రూపొందిస్తున్నట్లు సమాచారం. తొలి భాగంలో అతిథి పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్న నేపథ్యంలో, అదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ సీక్వెల్‌ను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.
తాజాగా సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు సినిమాపై హైప్‌ను రెట్టింపు చేశాయి. ‘జైలర్ 2’లో షారుక్ ఖాన్, మోహన్‌లాల్, రమ్యకృష్ణ, శివరాజ్‌కుమార్ కీలక అతిథి పాత్రల్లో కనిపించనున్నారని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా షారుక్ ఖాన్ పేరు అధికారికంగా వినిపించడంతో అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. మిథున్ చక్రవర్తి కూడా ఈ సీక్వెల్‌లో ముఖ్య పాత్రలో నటించనున్నట్లు తెలిపారు.
ఇక శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ, పార్ట్ 1 ముగిసిన చోటు నుంచే పార్ట్ 2 ప్రారంభమవుతుందని తెలిపారు. ఈసారి తన పాత్రకు ఎక్కువ స్క్రీన్ టైమ్ ఉంటుందని చెప్పారు. ‘జైలర్’లో రజనీకాంత్‌ను పవర్‌ఫుల్‌గా చూపించిన స్టైల్‌ను మరింత అప్‌గ్రేడ్ చేస్తూ, 2026 జూన్ 12న సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ ప్రమోషన్లతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యోచిస్తోంది.

