Electricity Ambulance Service : తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్త అందించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు. రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ‘విద్యుత్ అంబులెన్స్’ సేవను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. కరెంట్ సమస్యలు తలెత్తితే 1912 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే 24 గంటల్లో పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రత్యేకించి ట్రాన్స్ఫార్మర్ దెబ్బతినడం, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు వంటి సమస్యలకు విద్యుత్ అంబులెన్స్‌లు తక్షణ స్పందన చూపుతాయని భట్టి విక్రమార్క వివరించారు. ఇకపై ఏఈలు లేదా డీఈలకు నేరుగా ఫోన్ చేయాల్సిన అవసరం లేదని, కేవలం 1912కు కాల్ చేస్తే సమస్య ఆటోమేటిక్‌గా నమోదై ఫీల్డ్ సిబ్బందికి సమాచారం అందుతుందని చెప్పారు. వెంటనే విద్యుత్ అంబులెన్స్ వాహనం పొలం వద్దకు చేరుకొని సమస్యను పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు.
అదనంగా, రైతుల సమస్యలను మరింత సమీపంగా తెలుసుకోవడానికి వారానికి మూడు రోజులు విద్యుత్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ‘ప్రజాబాట’ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజుల్లో అధికారులు నేరుగా పొలాలకు వెళ్లి రైతులతో మాట్లాడి, సమస్యలను పరిశీలించి త్వరగా పరిష్కరిస్తారని భట్టి విక్రమార్క తెలిపారు. అవసరమైన రైతులకు మాత్రమే కొత్త ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేస్తున్నట్లు కూడా స్పష్టం చేశారు.

