Government employees 20% EV discount : తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీలు) వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రభుత్వ వాహనాల్లో 20 నుంచి 30 శాతం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జీవో 41 ద్వారా అమలవుతున్న ఈవీ పాలసీ ద్వారా పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా రవాణా వ్యవస్థలో భారీ మార్పులు తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు.
రాష్ట్రంలో ఈవీల అమ్మకాలు గతంలో 0.3 శాతం నుంచి ఇప్పుడు 2 శాతానికి పెరిగాయని, ఏడాది కాలంలో లక్ష ఈవీలు అమ్ముడు పోయాయని మంత్రి పేర్కొన్నారు. ఒకసారి ఛార్జింగ్‌తో 15 కి.మీ. మాత్రమే ప్రయాణించే సామర్థ్యం ఉన్న ఈవీలు ఇప్పుడు 500 కి.మీ. వరకు ప్రయాణించే స్థాయికి చేరాయని చెప్పారు. కార్యాలయాలు, గ్రేటర్ కమ్యూనిటీ హాల్స్, విద్యాలయాల వద్ద ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఫార్మా, ఐటీ కంపెనీలు, పాఠశాల బస్సులు 25 నుంచి 50 శాతం వరకు ఈవీలు కొనేలా విధానం తీసుకురానున్నట్లు ప్రకటించారు.
పర్యావరణ హితం కోసం రాష్ట్రంలో కాలుష్య రహిత తెలంగాణను అందించాలని మంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఢిల్లీలాంటి ఎయిర్ పొల్యూషన్ హైదరాబాద్‌లో రాకుండా ఈవీలు, సీఎన్జీ, ఎల్పీజీ వాహనాల వినియోగం పెంచుతున్నట్లు చెప్పారు. ఆర్టీసీలో ప్రస్తుతం 570 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని, త్వరలో మరో 2 వేల బస్సులు రానున్నాయని, అందులో వరంగల్‌కు 100, నిజామాబాద్‌కు 50 బస్సులు కేటాయిస్తామని ప్రకటించారు. 15 ఏళ్లు దాటిన ఆర్టీసీ బస్సులను స్క్రాప్‌కు తరలిస్తామని కూడా మంత్రి తెలిపారు. ఈవీల వినియోగంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్‌గా నిలవాలని మంత్రి ఆకాంక్షించారు.

