Amaravati Farmers Get ₹1.5 Lakh Loan Waiver : తుళ్లూరు మండలం వడ్లమాను గ్రామంలో అమరావతి రాజధాని ప్రాంతానికి సంబంధించిన రెండో దశ భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) ప్రక్రియను మంత్రి నారాయణ అధికారికంగా ప్రారంభించారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం సేకరించిన భూమిని వేగంగా అభివృద్ధి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం, క్రీడా సముదాయం వంటి కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను రాబోయే మూడేళ్లలో పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన 34 వేల ఎకరాల్లో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.
రాజధాని ప్రాంత రైతులకు భారీ ఉపశమనం కల్పిస్తూ మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడినట్టు ఆయన తెలిపారు. జనవరి 6, 2026 వరకు అర్హత కలిగిన రైతులు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తామని, ఈ ప్రయోజనం రూ.1.5 లక్షల వరకు ఉన్న రుణాలకు వర్తిస్తుందని మంత్రి ప్రకటించారు. రెండో విడత భూసేకరణలో రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్, స్పోర్ట్స్ సిటీ నిర్మాణం కోసం 7 గ్రామాల్లో దశలవారీగా ప్రక్రియ జరుగుతోంది.
వడ్డమాను, హరిచంద్రాపురం, పెద్దపరిమి తదితర గ్రామాల పరిధిలో 9097.56 ఎకరాల పట్టాభూమి, పల్నాడు జిల్లాలోని నాలుగు గ్రామాల్లో 7465 ఎకరాలతో కలిపి మొత్తం 16,666.57 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ చేయనున్నారు. రైతులకు ప్లాట్లు, మౌలిక వసతులు కల్పించిన అనంతరం మిగిలిన 2500 ఎకరాలను స్పోర్ట్స్ సిటీ, రైల్వే ట్రాక్, రింగ్ రోడ్‌కు వినియోగిస్తారు. ప్రస్తుతం వైకుంఠపురం, పెద్దమద్దూరు, యండ్రాయి, కర్లపూడి గ్రామాల్లో నోటిఫికేషన్ జారీ అయింది. ఈ ప్రక్రియతో అమరావతి అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

