Tuesday, December 16, 2025
Homeజిల్లా వార్తలుChallapalli Rice Mill : రైస్ మిల్ దోపిడీ.. కోర్టును ధిక్కరించిన బ్యాంకు అధికారులు.. న్యాయం...

Challapalli Rice Mill : రైస్ మిల్ దోపిడీ.. కోర్టును ధిక్కరించిన బ్యాంకు అధికారులు.. న్యాయం కోసం రైస్ మిల్ కుటుంబం పోరాటం

Challapalli Rice Mill : కృష్ణా జిల్లా చల్లపల్లిలోని ప్రభాకర్ రా & బాయిల్డ్ రైస్ మిల్ కుటుంబ సభ్యులు తమ ఆస్తులు దోచుకుంటున్నారని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయం కోసం వేడుకున్నారు. బ్యాంకు అధికారులు కోర్టు స్టే ఉత్తర్వులను ధిక్కరించి, వారి రైస్ మిల్లులోని విలువైన యంత్రాలు, సామగ్రిని బలవంతంగా తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చల్లపల్లి రైస్ మిల్ ఎదుట మీడియా సమక్షంలో వారు తమ గోడును వెల్లడించారు.

వ్యాపార లావాదేవీల కారణంగా బ్యాంకుకు చెల్లించవలసిన రుణాలను సకాలంలో చెల్లించలేకపోవడంతో బ్యాంకు అధికారులు రైస్ మిల్లును సీజ్ చేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సీజ్‌తో తమ వ్యాపారం నిలిచిపోయిందని, దీంతో హైకోర్టును ఆశ్రయించినట్లు వారు వివరించారు. హైకోర్టు మరియు ట్రిబ్యునల్ కోర్టు ఈ రైస్ మిల్లులో ఎటువంటి అభివృద్ధి లేదా అమ్మకాలు చేపట్టరాదని స్పష్టమైన స్టే ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, బ్యాంకు అధికారులు ఈ ఆదేశాలను పాటించడం లేదని ఆరోపించారు.

కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం, బ్యాంకు అధికారులు కొందరు బడా వ్యాపారవేత్తలకు తొత్తులుగా మారి, “ఆప్షన్” పేరుతో నకిలీ పత్రాలను సృష్టించి రైస్ మిల్లులోని విలువైన యంత్రాలు, సామగ్రిని భారీ వాహనాల ద్వారా వేర్వేరు జిల్లాలకు తరలించారు. ఈ దోపిడీకి స్థానిక పోలీసులు కూడా న్యాయం చేయలేదని, కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఐటీ శాఖ మంత్రిని కుటుంబ సభ్యులు కోరారు. “మా కుటుంబం ఈ రైస్ మిల్‌పై ఆధారపడి జీవిస్తోంది. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ మా ఆస్తులను దోచుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మా గోడు విని న్యాయం చేయాలని కోరుతున్నాం,” అని ప్రభాకర్ రా & బాయిల్డ్ రైస్ మిల్ కుటుంబ సభ్యులు వాపోయారు.

RELATED ARTICLES

Most Popular