Cyclone Ditva : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దిత్వా’ తుఫాను (Cyclone Ditwah) ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదులుతోంది. ఆదివారం ఉదయానికి ఈ తుఫాను తీరానికి చేరువగా వచ్చి, తీరం వెంబడి సమాంతరంగా కదిలి సముద్రంలోనే క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. రానున్న 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
వాతావరణ శాఖ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది – శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు. ఈ జిల్లాల్లో శనివారం, ఆదివారం రోజుల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు (125 మి.మీ.కంటే ఎక్కువ) పడే అవకాశం ఉంది. అదనంగా కడప, ప్రకాశం, అన్నమయ్య జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వగా, బాపట్ల, గుంటూరు, పల్నాడు, అనంతపురం, కర్నూలు, శ్రీసత్యసాయి, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని, తక్కువలో ఉన్న ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, ముఖ్యంగా మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించాయి. అన్ని జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండి సన్నద్ధంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.

