Pensions : కూటమి ప్రభుత్వం అమరావతి రైతులకు గుడ్ న్యూస్ ఇచ్చింది. పెన్షన్లు, ఆరోగ్య కార్డుల సమస్యలను ఒక నెలలోపు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి పి.నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్లతో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. శనివారం CRDA కార్యాలయంలో ఈ కమిటీ సమావేశమైంది. ఇప్పటికే 38 వేల మంది రైతులకు హెల్త్ కార్డులు జారీ చేశామని, వీరిలో 10 వేల మంది వినియోగించుకున్నారని పెమ్మసాని తెలిపారు. గ్రామ కంఠాలు, అసైన్డ్ లంక భూములు, జరీబు-మెట్ట భూములపై సర్వే నిర్వహిస్తామని, ఎవరికీ అన్యాయం జరగనివ్వమని హామీ ఇచ్చారు. ప్రతి 15 రోజులకు ఒకసారి రైతులతో సమావేశమై సమస్యలు వింటామని చెప్పారు.
ఏపీ క్యాబినెట్ అమరావతిలో రెండో దశ భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్)కు ఆమోదం తెలిపింది. 7 గ్రామాల పరిధిలో 16,666 ఎకరాలను సమీకరించే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైల్వే స్టేషన్, రైల్వే లైన్, స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం ఈ భూమి అవసరమని మంత్రి నారాయణ తెలిపారు. అసైన్డ్ & లంక భూములపై వచ్చే క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అమరావతిని అంతర్జాతీయ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎయిర్ పోర్ట్ లేనిదే రాజధాని అభివృద్ధి సాధ్యం కాదని, అందుకే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపడతామని సీఎం చంద్రబాబు నిర్ణయించారని మంత్రి నారాయణ వెల్లడించారు. అలాగే 200 కేవీ, 400 కేవీ విద్యుత్ లైన్ల కోసం టెండర్లు పిలిచామని, స్పోర్ట్స్ సిటీ కోసం గతంలో 70 ఎకరాలు మాత్రమే కేటాయిస్తే ఇప్పుడు 2,500 ఎకరాలు ఇస్తున్నామని తెలిపారు.

