Virat Kohli Rohit Sharma Test Return : టీమ్ ఇండియా టెస్టు క్రికెట్లో వరుసగా మూడోసారి ఘోరంగా విఫలమైంది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ తర్వాత ఇప్పుడు స్వదేశంలోనే దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌ను వైట్‌వాష్‌తో కోల్పోయింది. యువ ఆటగాళ్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్ల అనుభవ లోపం ఈ ఓటములకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వరుస ఓటములతో బీసీసీఐ, కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పై ఫ్యాన్స్ నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ల్క లేకపోవడమే ప్రధాన కారణమన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
దక్షిణాఫ్రికా సిరీస్ ఓటమి తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను టెస్టు జట్టులోకి తిరిగి తీసుకొచ్చేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోందని, వారి రిటైర్మెంట్ను వెనక్కి తీసుకోమని కోరినట్లు కొన్ని జాతీయ మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. ఈ వార్తలపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ స్పందించాడు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, కానీ రోహిత్-కోహ్లీ తిరిగి టెస్టులు ఆడటం కొంతవరకు నిజమవ్వచ్చని, వారు తప్పకుండా ఆడాలని తాను కోరుకుంటున్నట్లు పీటర్సన్ అభిప్రాయపడ్డాడు.
అయితే బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ వార్తలను పూర్తిగా కొట్టిపారేశాడు. విరాట్ కోహ్లీతో ఇలాంటి ఎలాంటి చర్చలూ జరపలేదని, ఇవన్నీ కేవలం పుకార్లేనని స్పష్టం చేశాడు. ప్రస్తుతం రోహిత్, కోహ్లీలు టీ20 నుంచి రిటైర్ అయినా వన్డేల్లో కలిసి ఆడుతున్నారు. రోహిత్ ఈ ఏటి మేలో టెస్టు రిటైర్మెంట్ ప్రకటించగా, కోహ్లీ కూడా ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా రిటైర్మెంట్ ప్రకటించినట్లు తెలుస్తోంది.

