CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లా గోపీనాథపట్నంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పదేపదే చెబుతున్న మాటను గుర్తుచేస్తూ, రాష్ట్రంలో మరో 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలని ఆకాంక్షించారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం సరిచేస్తోందని, ఈ విజయం ప్రజల కోసమేనని, తమ కలయిక వ్యక్తిగత లాభాల కోసం కాదని స్పష్టం చేశారు.
సూపర్ సిక్స్ హామీలను అసాధ్యమంటూ విమర్శించిన వారికి ఇప్పుడు అవే సూపర్ సక్సెస్‌గా నిరూపించామని చంద్రబాబు గర్వంగా చెప్పారు. కేవలం 18 నెలల్లోనే పింఛన్ల కోసం రూ.50 వేల కోట్లు ఖర్చు చేశామని, ఐదేళ్లలో రూ.1.65 లక్షల కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం ఇంత స్థాయిలో పింఛన్లు ఇవ్వడం లేదని, రాష్ట్ర జనాభాలో ప్రతి 100 మందిలో 13 మందికి పింఛను అందుతోందని, 59 శాతం మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. అప్పులు ఉన్నా, ఆదాయం తక్కువైనా చెప్పిన మాట నిలబెట్టుకున్నామని ధీమా వ్యక్తం చేశారు.
మహిళల గౌరవం కోసం ‘స్త్రీ శక్తి’ ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, రైతుల ఆదాయం పెంచేందుకు పంచసూత్రాలు, సమీకృత వ్యవసాయం, చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి, పోలవరం కుడి కాల్వ ద్వారా నీటి సదుపాయం వంటి కీలక ప్రకటనలు చేశారు. ఆహార అలవాట్లు మారడం వల్లే బీపీ, షుగర్ వంటి వ్యాధులు వస్తున్నాయని, సమీకృత వ్యవసాయంతో ఆరోగ్యం-ఆదాయం రెండూ మెరుగవుతాయని చంద్రబాబు దృఢంగా చెప్పారు.

