liquor new policy : తెలంగాణలో కొత్త మద్యం పాలసీ సోమవారం (డిసెంబర్ 1, 2025) నుంచి అమలులోకి రానుంది. రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలు కొత్త లైసెన్స్‌దారుల చేతికి చేరుకున్నాయి. ఈ పాలసీ 2027 నవంబరు వరకు కొనసాగనుండగా, దీని ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయం సమకూరుతుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. పాత పాలసీ (2023-25) గడువు ఆదివారంతో ముగియగా, ఆ రెండేళ్లలోనే మద్యం అమ్మకాలు ఊహించని స్థాయిలో పెరిగాయి.
గత రెండేళ్లలో 724 లక్షల కేసుల లిక్కర్, 960 లక్షల కేసుల బీరు అమ్మకాలు జరిగి మొత్తం రూ.71,550 కోట్ల విలువైన వ్యాపారం నమోదైంది. ఈ ఏడాది జనవరి-నవంబరు మధ్య కాలంలోనే రూ.29,766 కోట్ల అమ్మకాలు సాధించారు. మొత్తం ఆదాయంలో 80 శాతం నేరుగా ప్రభుత్వ ఖాతాలోకి వచ్చింది. లైసెన్స్ ఫీజులు, దరఖాస్తు ఫీజులతో కలిపి మద్యమే రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా మారింది.
కొత్త పాలసీలో కీలక మార్పులు చేశారు. దుకాణం దరఖాస్తు ఫీజును రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారు. వార్షిక లైసెన్స్ ఫీజును అమ్మకాల ఆధారంగా స్లాబ్‌లుగా విభజించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో అత్యధిక స్లాబ్ రూ.1.10 కోట్ల వరకూ ఉండగా, ఇతర స్లాబ్‌లు రూ.85 లక్షలు, రూ.56 లక్షలు, రూ.55 లక్షలు, రూ.50 లక్షలుగా నిర్ణయించారు. ఈ ఫీజుల్లో ఆరో వంతు ఇప్పటికే వసూలు చేశారు.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు, మేడారం జాతర వంటి భారీ ఉత్సవాలు మద్యం అమ్మకాలను మరింత పెంచుతాయని అంచనా. ఈ అవకాశాలను దృష్టిలో ఉంచుకుని కొత్త వ్యాపారులు ఉత్సాహంగా దుకాణాలను ప్రారంభిస్తున్నారు. మందుబాబులకు పండగ లాంటి వాతావరణంలో కొత్త మద్యం పాలసీ అడుగుపెట్టింది.

