Vaibhav Suryavanshi : బిహార్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ టీ20 టోర్నీలో కొత్త చరిత్ర సృష్టించాడు. కేవలం 14 ఏళ్ల 250 రోజుల వయసులో సెంచరీ సాధించి, ఈ టోర్నీ చరిత్రలో అతి పిన్న వయస్కుడిగా సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు.
మంగళవారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మహారాష్ట్రతో జరిగిన గ్రూప్ E మ్యాచ్‌లో వైభవ్ అదరగొట్టాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన బిహార్ తరఫున ఓపెనర్‌గా వచ్చిన ఈ లెఫ్ట్ హ్యాండర్ కేవలం 61 బంతుల్లోనే 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 108 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
ఈ అద్భుత ప్రదర్శనతో అతను మహారాష్ట్రకు చెందిన విజయ్ జోల్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. 2013లో 18 ఏళ్ల 118 రోజుల వయసులో విజయ్ జోల్ ఈ టోర్నీలో సెంచరీ చేశాడు. వైభవ్ ఆ రికార్డును దాదాపు నాలుగేళ్ల వ్యవధితో అధిగమించాడు. వైభవ్ సూర్యవంశీ ధనుకులతో బిహార్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఆకాష్ రాజ్ (26), ఆయుష్ లోహరుక (25) కూడా రాణించారు. అనంతరం 177 పరుగుల లక్ష్య చేధనలో మహారాష్ట్ర 19.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఓపెనర్ పృథ్వీ షా (30 బంతుల్లో 66; 11×4, 1×6) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. నీరజ్ జోషి (30), రంజీత్ నికం (27) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. బిహార్ బౌలర్లలో మహ్మద్ సలావుద్దీన్ ఇజార్, సకీబుల్ గని చెరో 2 వికెట్లు తీశారు. రాజస్థాన్ రాయల్స్ గతేడాది అండర్-19 వేలంలో వైభవ్‌ను 1.10 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలోనూ సంచలనం సృష్టించడంతో టీమిండియా భవిష్యత్ తారగా ఆశలు రేకెత్తిస్తున్నాడు.

