Hyderabad to Bangalore Journey : దక్షిణ భారతదేశంలో రైలు ప్రయాణానికి విప్లవాత్మక మార్పు రానుంది. హైదరాబాద్-బెంగళూరు మార్గంలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ముందుకు సాగుతోంది. హైదరాబాద్-బెంగళూరు మధ్య బుల్లెట్ ట్రైన్ మార్గం కోసం అంధ్రప్రదేశ్‌లో మట్టి నమూనాల పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్ట్‌తో రెండు ఐటీ హబ్‌ల మధ్య ప్రయాణ సమయం 8-10 గంటల నుంచి కేవలం 2 గంటలకు తగ్గనుంది. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు కర్నూలు జిల్లాలో 263 కిలోమీటర్ల మార్గంలో మట్టి, రాళ్ల నమూనాలు సేకరిస్తూ, భూ తపాలు, రిమోట్ సెన్సింగ్ అధ్యయనాలు చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎకనామిక్ కారిడార్ల మధ్య బుల్లెట్ ట్రైన్లు నడపాలని నిర్ణయించిన నేపథ్యంలో హైదరాబాద్-బెంగళూరు మార్గాన్ని ఎంపిక చేసింది. మొత్తం 576.6 కిలోమీటర్ల మార్గం, హైదరాబాద్-బెంగళూరు హైవేకు సమాంతరంగా సాగుతుంది. ఈ మార్గంలో తెలంగాణలో 4, ఆంధ్రప్రదేశ్‌లో 6, కర్ణాటకలో 3 స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. ఆంధ్రలో కర్నూలు, దోఆన్, గుత్తి, అనంతపురం, దుడ్డెబండ, హిందూపూర్ వంటి ప్రదేశాల్లో స్టేషన్లు రానున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లాలోని దుడ్డెబండ స్టేషన్‌కు కియా, సంబంధిత పరిశ్రమల కారణంగా ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఈ బుల్లెట్ ట్రైన్లు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ప్రస్తుతం వందేభారత్ రైళ్లు 130 కిలోమీటర్ల వేగంతో నడిచి, కర్నూలు-బెంగళూరు మధ్య 5.30 గంటలు పడుతున్నాయి. కానీ బుల్లెట్ ట్రైన్‌తో ఈ ప్రయాణం కేవలం 1.20 గంటల్లో పూర్తవుతుంది. మొత్తం హైదరాబాద్-బెంగళూరు మార్గం 2 గంటల్లోనే పూర్తవుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో మరో ఆకర్షణీయ అభివృద్ధి.. గుంటూరు-గుంతకల్లు మార్గంలో డబులింగ్ పనులు తుది దశకు చేరాయి. 2026-27 ఆర్థిక సంవత్సరం నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. దీంతో నంద్యాల నుంచి గుంటూరు, విజయవాడ, గుంతకల్లు వైపు కొత్త ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ప్రవేశపెట్టే అవకాశం ఏర్పడుతోంది.

