Kokapet Land Price : హైదరాబాద్ పరిసర ప్రాంతంలోని కోకాపేట ‘గోల్డెన్ మైల్’ ప్రాంతంలో హెచ్ఎండీఏ (HMDA) నిర్వహిస్తున్న నియోపొలిస్ భూముల వేలం కొనసాగుతోంది. మంగళవారం (డిసెంబర్ 3, 2025) జరిగిన మూడో విడత ఈ-వేలం మరోసారి రికార్డులు బద్దలు కొట్టింది.
మూడో విడతలో మొత్తం 8.04 ఎకరాల భూమిని రెండు ప్లాట్లుగా (ప్లాట్ నం. 19 & 20) వేలం వేశారు.
ప్లాట్ నం. 19 (4 ఎకరాలు) – ఎకరం రూ.131 కోట్లు చొప్పున మొత్తం రూ.524 కోట్లు
ప్లాట్ నం. 20 (4.04 ఎకరాలు) – ఎకరం రూ.118 కోట్లు చొప్పున సుమారు రూ.476 కోట్లు
ఈ రెండు ప్లాట్ల వేలం ద్వారా ఒక్క రోజులోనే హెచ్ఎండీఏకు రూ.1,000 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ముఖ్యంగా ప్లాట్ నం. 19లో ఎకరం రూ.131 కోట్లు పలికినందుకు కొనుగోలుదారుల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్టు తెలుస్తోంది.
ఇప్పటి వరకు జరిగిన మూడు విడతల్లో మొత్తం 6 ప్లాట్లలోని 27 ఎకరాల భూమి వేలం పూర్తయింది. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.3,708 కోట్ల ఆదాయం వచ్చింది.
నాలుగో విడత వేలం డిసెంబర్ 5న
కోకాపేట నియోపొలిస్ ప్రాజెక్టులో మిగిలిన భూములను నాలుగు విడతల్లో వేలం వేయాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. ఈ క్రమంలో నాలుగో విడత ఈ-వేలం డిసెంబర్ 5న జరగనుంది. ఈ విడతలో కోకాపేట గోల్డెన్ మైల్‌లో 2 ఎకరాలు , మూసాపేటలో 15 ఎకరాలు, మొత్తం 17 ఎకరాల భూమి వేలానికి రానుంది.
హైదరాబాద్ ఐటీ కారిడార్‌కు అతి సమీపంలో ఉండటం, అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు దగ్గరగా ఉండటంతో కోకాపేట భూములకు డిమాండ్ ఆకాశాన్నంటుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరుతోంది.

