Akhanda 2 movie release : నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన అత్యంచిత ‘అఖండ 2 తాండవం’ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ ఆకాంక్ష నెలకొని ఉండగా, ఆఖరి క్షణంలో విడుదల వాయిదా పడింది. ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యేలా ప్లాన్ చేసిన ఈ చిత్రాన్ని అనివార్య పరిస్థితుల వల్ల నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధికారిక ప్రకటన చేసింది. ముందుగా డిసెంబర్ 4 రాత్రి ప్రీమియర్ షోలు రద్దు చేసిన చిత్రబృందం, కొన్ని గంటల్లోనే పూర్తి విడుదలను క్యాన్సిల్ చేసింది.
‘అఖండ 2’ విడుదలపై మద్రాస్ హైకోర్టు తాత్కాలిక స్టే ఆదేశాలు జారీ చేసింది. నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్‌కు భాగస్వామ్యంగా ఉన్న ఎరోస్ ఇంటర్నేషనల్‌కు గత సినిమాలు (‘నేనొక్కడినే’, ‘ఆగడు’ వంటివి) నుంచి ₹28 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తాన్ని చెల్లించకుండానే సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఎరోస్ ఆరోపించి, డిసెంబర్ 3న కోర్టులో పిటిషన్ వేసింది. దీని పర్యవసానంగా, థియేట్రికల్, డిజిటల్ విడుదలలపై తాత్కాలిక నిషేధం విధించారు. ఈ తీర్పు తదుపరి ఆదేశాలు జారీ కావడం వరకు కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది.
ఇది కాకుండా, నిర్మాణ సంస్థకు ఆర్థిక ఇబ్బందులు, ల్యాబ్ క్లియరెన్స్‌లు, డిస్ట్రిబ్యూటర్లతో బాకీలు వంటి సమస్యలు కూడా వాయిదాకు కారణాలుగా చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా, డిస్ట్రిబ్యూటర్లు పూర్తి చెల్లింపులు చేయకపోవడం వల్ల డిఫిసిట్ తలెత్తిందని, ఇది సినిమా విడుదలకు అడ్డంకిగా మారిందని వర్గాలు తెలిపాయి.

