Andhra Pradesh Electricity charges : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు భారీ ఊరట కలిగించే ప్రకటన చేశారు. విద్యుత్ ఛార్జీలను ఏ మాత్రం పెంచబోమని, ఎలాంటి పరిస్థితుల్లోనూ కరెంటు బిల్లుల భారం ప్రజలపై వేయమని స్పష్టం చేశారు. విద్యుత్ రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ, సమర్థవంతమైన నిర్వహణతో ఈ రంగాన్ని గాడిలో పెడతామని ధీమా వ్యక్తం చేశారు. “విద్యుత్ డిపార్ట్మెంట్ పరిస్థితి అతి దయనీయంగా ఉంది. అయినా ప్రజలపై భార్జీల భారం మోపకుండా, సమర్థవంతంగా నడిపిస్తాం” అని సీఎం హామీ ఇచ్చారు.
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “కక్ష సాధింపు రాజకీయాలతో రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేశారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ జాతీయంగా దెబ్బతింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అన్ని వ్యవస్థలనూ చక్కదిద్దుతూ ముందుకు దూసుకెళ్తోంది” అని అన్నారు.
2014-19 మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు 13.5 శాతం ఉండగా, 2019-24 వైసీపీ పాలనలో 10.32 శాతానికి పడిపోయిందని గుర్తు చేశారు. “ఐదేళ్లలో ఒక్క చెరువు కట్టలేది లేదు, ఒక్క కిలోమీటరు రోడ్డు వేయలేదు. కేంద్ర నిధులను దారి మళ్లించారు. 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చి వెళ్లారు” అని ఆరోపించారు.

