Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఆందోళన నెలకొంది. విజయనగరం జిల్లాలో లక్షణాలు కనిపించిన ఒక మహిళ మరణించడంతో ప్రజల్లో భయం పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు వైద్యారోగ్య శాఖ గుర్తించింది.
ఈ వ్యాధి ఎలా సోకుతుంది : నలుసు లేదా చిన్న కీటకం (చిగ్గర్) కుట్టినప్పుడు ఈ ఇన్‌ఫెక్షన్ సోకే అవకాశం ఉంది. కుట్టిన చోట నల్లటి మచ్చలు, దద్దుర్లు కనిపించడం ప్రధాన లక్షణం. లాలాజలంతో ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నప్పటికీ, మనుషుల నుంచి మనుషులకు నేరుగా ఇది వ్యాపించదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ వ్యాధి విస్తరణ ఎక్కువగా కనిపిస్తోంది.
లక్షణాలు : జ్వరం, వాంతులు, తలనొప్పి, శరీర నొప్పులు, పొడి దగ్గు, కుట్టిన చోట నల్లటి మచ్చలు/దద్దుర్లు.. ఈ లక్షణాలు గమనించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
తగిన చికిత్స అందకపోతే రోగి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. శ్వాస సంబంధిత ఇబ్బందులు, వెన్నెముక ఇన్‌ఫెక్షన్లు, కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశముంది. వ్యాధి తీవ్రతను బట్టి మరణాల రేటు 6% నుంచి 30% వరకు ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు.
తక్షణ చికిత్స ప్రారంభిస్తే మరణాల రేటును 2% లోపు తగ్గించవచ్చు. ప్రస్తుతం దోమలు, నలుసులు ఎక్కువగా విస్తరిస్తున్న సీజన్ కావడంతో వచ్చే రెండు మూడు నెలలు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

