Anganwadi Salary Hike : ఆంధ్రప్రదేశ్‌లోని అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకారిణులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బంపర్ ఆఫర్ అందించింది. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి బుధవారం విజయవాడలో రూ.75 కోట్ల విలువైన 5G స్మార్ట్‌ఫోన్‌లను అంగన్‌వాడీ సిబ్బందికి అధికారికంగా పంపిణీ చేశారు.రాష్ట్రంలోని 55,706 అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించి మొత్తం 58,204 మంది కార్యకర్తలు, సహాయకారిణులు, మినీ కార్యకర్తలకు ఈ అత్యాధునిక మొబైల్ ఫోన్లు అందనున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ, అంగన్‌వాడీ కేంద్రాలు తల్లిదండ్రుల నమ్మకానికి నిలయంగా మారాయని, శాఖ అందిస్తున్న సేవలు 98 శాతం సంతృప్తికరంగా, A++ గ్రేడ్‌లో ఉన్నాయని కొనియాడారు.
జీతాల పెంపు – సీఎం పరిశీలనలో
అంగన్‌వాడీ సిబ్బంది వేతనాల పెంపు అంశం ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలనలో ఉందని మంత్రి స్పష్టం చేశారు. అలాగే గ్రామీణ ప్రాంతాల అంగన్‌వాడీ ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలనే ప్రతిపాదనను కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు.“అంగన్‌వాడీలకు ఏది కావాలో అది చేస్తాం. కానీ ఎవరో రెచ్చగొట్టి ధర్నాలు చేసి సమయం వృథా చేసుకోవద్దు” అని మంత్రి సూటిగా సూచించారు.

