AP Mega DSC Notification : ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్! సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మరోసారి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సమయాత్తమవుతోంది. ఫిబ్రవరి నెలలో సుమారు 2,500 ఉపాధ్యాయ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఈసారి ఏపీ డీఎస్సీలో మరో కీలక మార్పు రానుంది. విద్యాశాఖ ఆధునీకరణ లక్ష్యంతో ఇంగ్లీష్ ప్రావీణ్యం మరియు కంప్యూటర్ అవగాహనకు సంబంధించి ప్రత్యేకంగా ఒక పేపర్ నిర్వహించాలని విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది. డీఎస్సీతో పాటు ఈ కొత్త పేపర్ పరీక్ష కూడా జరుగుతుందని అధికారులు వెల్లడించారు. అయితే, దీనికి ప్రభుత్వం నుంచి ఆమోదం రావాల్సి ఉంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సారథ్యంలో ఈ చర్చలు జరుగుతున్నాయి.
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వల్ల బోధన నాణ్యతపై ప్రభావం పడుతోందని విద్యాశాఖ అంచనాకు వచ్చింది. ఈ ఏడాది ఎక్కువ మంది ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఖాళీలను త్వరగా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీఎస్సీ నిర్వహణకు సంబంధించి పోస్టుల గుర్తింపు, రిజర్వేషన్ విధానం, పరీక్షా విధానంపై అధికారులు ఇంకా చర్చలు కొనసాగిస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఈ నోటిఫికేషన్ బంపర్ అవకాశంగా మారనుంది!

