Big Rain Alert : ఆంధ్రప్రదేశ్‌కు “సెన్యార్” తుఫాను ముప్పు పూర్తిగా తప్పింది. ఇండోనేషియా సమీపంలోని మలక్కా జలసంధి వద్ద ఏర్పడిన తీవ్ర వాయుగుండం బుధవారం తుఫానుగా మారినా, పశ్చిమ దిశగా కదిలి ఇండోనేషియా తీరాన్ని తాకి క్రమంగా బలహీనపడింది. ఈ రోజు (గురువారం) సాయంత్రం వరకు తుపాను తీవ్రత కొనసాగి పూర్తిగా బలహీనమవుతుందని వాతావరణ శాఖ తెలిపంది.
సెన్యార్ ముప్పు తప్పినా ఏపీ ప్రజలకు ఉపశమనం లభించేలోపే వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. శ్రీలంక సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం ఈ రోజు (గురువారం) వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ వాయుగుండం ఉత్తర-వాయువ్య దిశగా కదిలుతూ శనివారం నాటికి ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల వైపు చేరుకుని మరింత బలపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ కొత్త వ్యవస్థ ప్రభావంతో రాబోయే మూడు రోజులు (శుక్ర, శని, ఆదివారం) ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అతిభారీ వర్షాలు, బలమైన ఈదిక గాలులు వీస్తాయి. అన్నమయ్య, కడప, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు, ఆదివారం నాటికి కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.

