Cigarette Prices Hike : భారత ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులు మరియు పాన్ మసాలాపై కొత్త పన్నులను విధించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరి 1, 2026 నుంచి అమలులోకి వచ్చే ఈ మార్పులతో సిగరెట్లు, పాన్ మసాలా వంటి ఉత్పత్తుల ధరలు గణనీయంగా పెరగనున్నాయి. ఇది GST కాంపెన్సేషన్ సెస్‌ను భర్తీ చేసేందుకు తీసుకున్న చర్యగా తెలుస్తోంది. పాన్ మసాలా, సిగరెట్లు వంటి ఉత్పత్తులపై 40 శాతం GST కొనసాగుతుంది, అదనంగా పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ, పాన్ మసాలాపై హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్ విధించనున్నారు.
డిసెంబర్ 2025లో పార్లమెంటు ఆమోదించిన రెండు బిల్లుల ఆధారంగా ఈ మార్పులు అమలవుతున్నాయి. ‘హెల్త్ సెక్యూరిటీ సే నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్-2025’ ప్రకారం పాన్ మసాలా తయారీపై సెస్ విధిస్తారు. అదేవిధంగా సెంట్రల్ ఎక్సైజ్ (అమెండ్‌మెంట్) బిల్ ద్వారా పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ డ్యూటీ వసూలు చేస్తారు. ఈ సెస్ తయారీ యూనిట్ల సామర్థ్యం ఆధారంగా నిర్ణయిస్తారు. బీడీలపై మాత్రం 18 శాతం GST మాత్రమే వర్తిస్తుంది.
ఈ కొత్త పన్నుల ద్వారా వచ్చే నిధులను ప్రజారోగ్యం బలోపేతం మరియు జాతీయ భద్రత కోసం ఖర్చు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పొగాకు వినియోగం తగ్గించడం, ఆరోగ్య సమస్యలను అరికట్టడం ఈ చర్యల ముఖ్య ఉద్దేశ్యం. ఇప్పటికే సిగరెట్లపై ఎక్సైజ్ డ్యూటీ రూ.2,050 నుంచి రూ.8,500 వరకు (ప్రతి వెయ్యి స్టిక్స్‌కు) ఉంటుంది. దీంతో వినియోగదారులపై భారం పడనుండగా, పొగాకు కంపెనీల షేర్లు కూడా పడిపోయాయి.

