Cricket Record : విజయ్ హజారే ట్రోఫీ తొలి రోజు దేశవాళీ వన్డే క్రికెట్‌లో రికార్డుల వర్షం కురిసింది. ఒకే రోజున ఏకంగా 22 సెంచరీలు నమోదై చరిత్రలో అరుదైన ఘట్టంగా నిలిచింది. చాలా కాలం తర్వాత దేశవాళీ టోర్నీలో బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ శతకాలతో అభిమానులను ఉర్రూతలూగించారు. ఢిల్లీ తరఫున ఆంధ్రతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 131 పరుగులు చేసి జట్టుకు విజయం అందించడమే కాకుండా, లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యంత వేగంగా 16,000 పరుగులు పూర్తి చేసి సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు.
మరోవైపు ముంబై సారథి రోహిత్ శర్మ సిక్కిం బౌలర్లపై విరుచుకుపడి కేవలం 94 బంతుల్లో 155 పరుగులు (18 ఫోర్లు, 9 సిక్స్‌లు) చేసి తన ‘హిట్‌మ్యాన్’ ఖ్యాతిని నిలబెట్టుకున్నాడు. జార్ఖండ్ తరఫున ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీతో ఫామ్‌లోకి రాగా, ఒడిశా బ్యాటర్ స్వస్తిక్ సమల్ డబుల్ సెంచరీతో రికార్డుల జాబితాలో చేరాడు.
ఈ టోర్నీలో అసలైన హైలైట్‌గా నిలిచింది బీహార్ జట్టు ప్రదర్శన. అరుణాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో బీహార్ 574/6 అనే ప్రపంచ లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. కేవలం 14 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ సెంచరీ బాది ప్రపంచ రికార్డు నెలకొల్పగా, 59 బంతుల్లో 150 పరుగులు చేసి ఏబీ డివిలియర్స్ రికార్డును బద్దలుకొట్టాడు. కెప్టెన్ గనీ 32 బంతుల్లో సెంచరీ సాధించి భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ వీరుడిగా నిలిచాడు. మొత్తంగా తొలి రోజే బ్యాటర్ల విధ్వంసంతో విజయ్ హజారే ట్రోఫీ అభిమానులకు ఘన వినోదం అందించింది.

