Delivery workers strike India : దేశవ్యాప్తంగా స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఈ–కామర్స్, ఫుడ్ డెలివరీ, హోమ్ సర్వీస్ ప్లాట్‌ఫామ్‌లకు చెందిన డెలివరీ, గిగ్ వర్కర్లు సమ్మెకు దిగారు. ఈ నెల 31 వరకు నిరసనలు కొనసాగనున్నాయి. క్షీణిస్తున్న పని పరిస్థితులు, తగిన వేతనాలు లేకపోవడం, భద్రతా చర్యలు, సామాజిక భద్రత లేమి వంటి సమస్యలను నిరసిస్తూ ఈ సమ్మెకు పిలుపునిచ్చారు. పండుగల సీజన్లో కూడా తమపై దోపిడీ కొనసాగుతుందని కార్మిక సంఘాలు ఆరోపించాయి.
ఎక్కువ గంటలు పనిచేయించుకోవడం, ఆదాయం తగ్గిపోవడం, అశాస్త్రీయ డెలివరీ టార్గెట్లు, ఎలాంటి విచారణ లేకుండా ఐడీలను బ్లాక్ చేయడం, ఉద్యోగ భద్రత లేకపోవడం వంటి సమస్యలతో డెలివరీ వర్కర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ), ఐఎఫ్ఏటీ పేర్కొన్నాయి. పారదర్శక వేతన విధానం అమలు చేయాలని, వివాదాస్పదమైన “10 నిమిషాల డెలివరీ” మోడల్‌ను ఉపసంహరించుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
అలాగే భద్రతా పరికరాలు అందించాలని, వివక్ష లేకుండా పని కేటాయించాలని, ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, పెన్షన్ వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలు కల్పించాలని కోరుతున్నారు. ఈ వ్యవహారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే జోక్యం చేసుకుని ప్లాట్‌ఫామ్ కంపెనీలను నియంత్రించాలని టీజీపీడబ్ల్యూయూ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ డిమాండ్ చేశారు. న్యాయం, గౌరవం, జవాబుదారీతనం కోసమే ఈ సమ్మె అని ఆయన స్పష్టం చేశారు.

