Dies Irae Movie Review : మలయాళ సినిమా అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక బ్రాండ్ ఏర్పడింది. ముఖ్యంగా హారర్-క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో వాళ్లు చేసే ప్రయోగాలు, పరిమిత బడ్జెట్‌లోనూ ఇభయపెట్టే ట్రీట్‌మెంట్ – ఇవన్నీ ఇతర భాషల ప్రేక్షకుల్ని కూడా ఆకర్షిస్తున్నాయి. అలాంటి లిస్టులో తాజాగా చేరిన సినిమానే ‘డీయస్ ఈరే’ (Deus Irae – లాటిన్‌లో ‘Day of Wrath’ అని అర్థం).
చాలా తక్కువ బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రం థియేటర్లలో 80 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి, బ్లాక్‌బస్టర్ అయింది. ఇప్పుడు OTTలోకి వచ్చేసరికి తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు.
కథ : ధనిక కుటుంబం నుంచి వచ్చిన రోహన్ (ప్రణవ్ మోహన్‌లాల్) ఒంటరిగా బంగ్లాలో ఉంటాడు. పార్టీలు, ఫ్రెండ్స్, ఎంజాయ్‌మెంట్ – ఇదీ అతని రొటీన్. అలాంటి సమయంలోనే అతని మాజీ ప్రేయసి కణి ఆత్మహత్య చేసుకుందని తెలుస్తుంది. ఆమె ఇంటికి వెళ్లిన రోహన్, ఆమె గదిలోంచి ఒక హెయిర్ క్లిప్‌ను అనుకోకుండా తీసుకొచ్చేస్తాడు. ఆ రోజు నుంచి అతని ఇంట్లో వింత సంఘటనలు మొదలవుతాయి.
అతను భావించేది కణి ఆత్మ కావచ్చు. కానీ పక్కింటి తాంత్రిక కుటుంబం నుంచి వచ్చిన మధుసూదన్ (కలైయరసన్) మాత్రం భిన్నంగా అనుమానిస్తాడు. రోహన్ చూసిన ఆకృతి పురుషుడిదైనా కాళ్లకు గజ్జెలు ఎందుకున్నాయి? ఈ రెండే పాత్రల చుట్టూ తిరిగే కథ ఎటు పయనిస్తుంది? చివరి 30 నిమిషాల్లో ఏం జరుగుతుంది? – ఇవే మిగతా సినిమా.
ప్లస్ పాయింట్స్ :
ఒకే లొకేషన్, రెండే ముఖ్య పాత్రలు – దాదాపు మొత్తం సినిమా ఒకే బంగ్లాలో జరుగుతుంది. తెరపై కనిపించే నటులు కేవలం ఇద్దరే. మిగతా కీలక పాత్రలు ఫొటోల రూపంలో మాత్రమే కనిపిస్తాయి. ఇంత పరిమిత వనరులతో టెన్షన్ క్రియేట్ చేయడం దర్శకుడి నైపుణ్యం.
దెయ్యం చూపించకపోవడం – జంప్ స్కేర్స్, గ్రాఫిక్స్, భారీ తాంత్రిక పూజలు బదులు కేవలం సౌండ్ డిజైన్, లైటింగ్, కెమెరా యాంగిల్స్‌తో భయం పుట్టించడం ఈ సినిమా ప్రత్యేకత.
చివరి 30 నిమిషాల ట్విస్ట్ – రెగ్యులర్ రివెంజ్ ఘోస్ట్ ఫార్ములాను పూర్తిగా తిరగరాస్తూ, ఒక్కసారిగా కథను వేరే దిశగా తీసుకెళ్తుంది. ఈ భాగమే సినిమాకి సూపర్ హిట్ స్టాంప్ కొట్టింది.
ప్రణవ్ మోహన్‌లాల్ – ఒంటరి పాత్రను ఎంతో నమ్మదగ్గట్టుగా పోషించాడు. భయం, అయోమయం, నిస్సహాయత – అన్ని ఎమోషన్స్‌నూ సహజంగా చూపెట్టాడు.
నేపథ్య సంగీతం – షాన్ రెహ్మాన్ స్కోర్ సినిమాకి ప్రాణం పోసింది. కొన్ని సన్నివేశాల్లో BGM ఒక్కటే భయం కలిగజేస్తుంది.
మైనస్ పాయింట్స్ :
కణి తమ్ముడు కిరణ్‌పై జరిగే దాడి సన్నివేశం చాలా గోరంగా, రక్తపాతంతో ఉంటుంది. ఆ ఒక్క సీన్ కోసం 18+ రేటింగ్ ఇవ్వాల్సి వచ్చింది. అంత గ్రాఫిక్ వయోలెన్స్ అవసరం లేదనిపిస్తుంది.
మొదటి అర్ధభాగంలో కాస్త స్లోగా సాగినట్టు అనిపిస్తుంది. రిపీటిటివ్ సన్నివేశాలు కొన్ని ఉన్నాయి.
ముగింపు : ‘డీయస్ ఈరే’ సాధారణ దెయ్యాల సినిమా కాదు. ఇది ఒక సైకలాజికల్ హారర్ థ్రిల్లర్, ఒక ప్రయోగం. దెయ్యం లేని దెయ్యాల సినిమా అని చెప్పొచ్చు. ఒక్కసారి రాత్రివేళ లైట్స్ ఆఫ్ చేసి, హెడ్‌ఫోన్స్ పెట్టుకొని చూస్తే… మీ ఇంట్లో కూడా ఏదో హెయిర్ క్లిప్ కనిపిస్తుందేమో అని అనుమానం కలుగుతుంది!

