Donald Trump : ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరో కీలక మలుపు తిరిగాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌లోని మూడు ప్రధాన అణు కేంద్రాలు -,ఫోర్డో, నటాన్జ్, ఇస్ఫహాన్లను విజయవంతంగా ధ్వంసం చేసినట్లు ప్రకటించారు. ఈ దాడులను “అద్భుతమైన సైనిక విజయం”గా అభివర్ణించిన ట్రంప్, ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా చేపట్టిన ఈ జాయింట్ ఆపరేషన్‌ను చారిత్రక ఘట్టంగా పేర్కొన్నారు.
ట్రంప్ తన ప్రకటనలో.. “ఇరాన్ మన ప్రజలను చంపుతోంది. మిడిల్ ఈస్ట్‌లో వందలాది మంది మరణించారు. ఇరాన్ సృష్టిస్తున్న మారణహోమాన్ని కొనసాగించకూడదని చాలా రోజుల క్రితమే నిర్ణయించుకున్నాను. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇజ్రాయెల్, అమెరికా జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ విజయానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను,” అని వ్యాఖ్యానించారు.
ఈ దాడులు ఇజ్రాయెల్ నేతృత్వంలోని “ఆపరేషన్ రైజింగ్ లయన్”లో భాగంగా జరిగినట్లు తెలుస్తోంది, ఇందులో అమెరికా సైనిక మద్దతు కీలక పాత్ర పోషించింది. ఫోర్డో, నటాన్జ్, ఇస్ఫహాన్‌లోని అణు సౌకర్యాలు ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమంలో కీలకమైనవిగా గుర్తించబడ్డాయి. ఈ దాడుల్లో ఇజ్రాయెల్ వందలాది ఫైటర్ జెట్లను ఉపయోగించినట్లు, ఎటువంటి నష్టాలు లేకుండా ఆపరేషన్ విజయవంతమైనట్లు నివేదికలు వెల్లడించాయి. అమెరికా బంకర్-బస్టింగ్ బాంబులు, ఇజ్రాయెల్ ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారం ఈ దాడులను సమర్థవంతంగా నిర్వహించడంలో సహాయపడింది.
ఈ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ “ఆపరేషన్ ట్రూ ప్రామిస్-3″ను ప్రారంభించి, టెల్ అవీవ్, జెరూసలేం, హైఫా నగరాలపై వందలాది బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. ఈ దాడుల్లో టెల్ అవీవ్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం స్వల్పంగా దెబ్బతిన్నట్లు అమెరికా రాయబారి మైక్ హకేబీ ధ్రువీకరించారు.

