England cricketer Robin Smith : ఇంగ్లండ్ మాజీ దిగ్గజ బ్యాట్స్‌మెన్ రాబిన్ స్మిత్ (62) సోమవారం ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో తన అపార్ట్మెంట్లో ఆకస్మికంగా మరణించాడు. దక్షిణాఫ్రికాలో జన్మించిన స్మిత్ ఇంగ్లండ్ తరఫున 62 టెస్టు మ్యాచ్‌లు, 71 వన్డేలు ఆడి మొత్తం 6,500కు పైగా అంతర్జాతీయ పరుగులు సాధించాడు. టెస్టుల్లో 43.67 సగటుతో 9 సెంచరీలతో సహా 4,236 పరుగులు చేశాడు. ఫాస్ట్ బౌలింగ్‌ను అత్యంత ధైర్యంగా ఎదుర్కొనే ఇంగ్లండ్ ఆటగాడిగా పేరుగాంచిన అతన్ని అభిమానులు ‘ది జడ్జ్’ అని పిలుచుకుంటారు.
1992 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన ఇంగ్లండ్ జట్టులో రాబిన్ స్మిత్ కీలక పాత్ర పోషించాడు. దేశవాళీ క్రికెట్లో హాంప్‌షైర్ కౌంటీ తరఫున సుదీర్ఘకాలం ఆడి 30,000కు పైగా పరుగులు సాధించిన ఘనత అతనిది. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన బౌలర్లను చిరునవ్వుతో ఎదుర్కొన్న ధైర్యశాలిగా అతనికి ప్రత్యేక గుర్తింపు లభించింది. స్మిత్ మరణ వార్తను అతని కుటుంబం ధృవీకరించింది.

