Gannavaram Airport : విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో నిర్మాణంలో ఉన్న నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ పనులు తుది దశకు చేరుకున్నాయి. గ్లాస్ మరియు స్టీల్ స్ట్రక్చర్‌తో రూపొందుతున్న ఈ భవనం ఇప్పటికే 80 శాతం పూర్తయింది. మిగిలిన 20 శాతం పనులు, ముఖ్యంగా ఇంటీరియర్ వర్క్స్, 2026 మార్చి నాటికి పూర్తి కానున్నాయని అధికారులు తెలిపారు. ఈ టెర్మినల్ పూర్తయితే గన్నవరం ఎయిర్‌పోర్టు దక్షిణ భారతదేశంలోని అతి పెద్ద, అత్యాధునిక విమానాశ్రయాల్లో ఒకటిగా మారనుంది.
ప్రస్తుతం గ్రాండ్ ఎంట్రన్స్ 95 శాతం, షంషాబాద్ తరహా మినీ ఫ్లైఓవర్ 90 శాతం పూర్తయ్యాయి. కొత్త ఏబీసీ కాంప్లెక్స్, ₹40 కోట్లతో నిర్మించిన ఏటీసీ టవర్, వైడ్-బాడీ విమానాలు పార్క్ చేయగలిగే కొత్త ఏప్రాన్‌లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. మూడు ఏరో బ్రిడ్జిలు, కాంక్రీట్ స్ట్రక్చర్ పూర్తి కాగా, ప్రయాణికులు నేరుగా విమానాల్లోకి అడుగుపెట్టే వెసులుబాటు కల్పిస్తుంది. గార్డెనింగ్, అంతర్గత రోడ్లు, కారు పార్కింగ్ ప్రాంతాలు కూడా దాదాపు సిద్ధమయ్యాయి.
కొత్త టెర్మినల్‌లో దేశీయ-అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ప్రత్యేక చాంబర్లు, సెంట్రలైజ్డ్ ఏసీ, సోలార్ ఎనర్జీ విద్యుత్ వ్యవస్థ, కన్వేయర్ బెల్ట్స్, కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్, సెక్యూరిటీ, కమర్షియల్ బ్లాకులు వంటి అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు కానున్నాయి. మొత్తం ప్రాజెక్టు శరవేగంగా పురోగమిస్తూ, వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి కావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రపంచస్థాయి విమానాశ్రయ సౌకర్యం అందనుంది.

