Government Teachers : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పాఠశాల ఉపాధ్యాయులకు కఠిన నియమాలు విధిస్తూ భారీ షాక్ ఇచ్చింది. అనుమతి లేకుండా నెల రోజుల పాటు విధులకు గైర్హాజరైన ఉపాధ్యాయులను శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగిస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి ఉపాధ్యాయులకు ముందుగా షోకాజ్ నోటీసు జారీ చేసి, విచారణ అనంతరం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా తొలగింపు చర్య తీసుకోవాలని జిల్లా విద్యాధికారులకు (DEO) ఆదేశించారు.
సోమవారం ఉపాధ్యాయుల హాజరు, ముఖ గుర్తింపు విధానం (FRS), మధ్యాహ్న భోజనం అమలు పైన డీఈఓలతో సమీక్ష నిర్వహించిన కమిషనర్, అనధికారిక గైర్హాజర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులపైనా చర్యలు తీసుకోవాలని, హాజరు శాతంపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు.
గత రెండేళ్లలోనే దీర్ఘకాలిక సెలవులు తీసుకొని విధులకు హాజరు కాని సుమారు 50 మంది ఉపాధ్యాయులను ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగాల నుంచి తొలగించినట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కొత్త ఆదేశాలు మరింత కఠినత్వాన్ని సూచిస్తున్నాయని ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

