Heavy Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతూ చెన్నైకి తూర్పున 50 కి.మీ., తీరానికి కేవలం 35 కి.మీ. దూరంలో ఉంది. గత 6 గంటల్లో గంటకు 3 కి.మీ. వేగంతో ఉత్తర దిశగా కదిలింది. పుదుచ్చేరి 140 కి.మీ., కడలూరు 160 కి.మీ., నెల్లూరు 170 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. అర్ధరాత్రి నాటికి తీరానికి 30 కి.మీ. దూరకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
అర్ధరాత్రి తర్వాత దిత్వా తీవ్ర వాయుగుండం బలహీనపడి సాధారణ వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అయినప్పటికీ దీని ప్రభావం కొనసాగుతుంది. రేపు (డిసెంబర్ 2) ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, కాకినాడ, కోనసీమ, తూర్పు-పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి.
సాయంత్రం 5 గంటల వరకు నెల్లూరు జిల్లా కొడవలూరులో 38.7 మి.మీ., నెల్లూరులో 36.7 మి.మీ., తిరుపతి జిల్లా తడలో 33.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. తుపాను బలహీనపడినా కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే పరిస్థితి ఉండటంతో రైతులు, మత్స్యకారులు, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

