Indiramma Illu : తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది పేద కుటుంబాలు ఆసరాగా ఎదురుచూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంపై రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది (2026) ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేశారు.మంత్రి మాట్లాడుతూ… మొదటి విడతలో ఇప్పటికే 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు మంజూరీ లభించిందని, 2026 మార్చి నాటికి లక్ష మందికి గృహ ప్రవేశాలు పూర్తవుతాయని తెలిపారు. అదే సమయంలో 2026 జూన్ నాటికి మరో రెండు లక్షల మందికి గృహ ప్రవేశాలు జరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు. “అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు అందే వరకు మేము విశ్రాంతి తీసుకోము” అని మంత్రి హామీ ఇచ్చారు.
మధ్యతరగతి కుటుంబాల కోసం ప్రత్యేక హౌసింగ్ పాలసీ
మంత్రి పొంగులేటి మరో ముఖ్య ప్రకటన చేశారు. మధ్యతరగతి కుటుంబాల కోసం కూడా ప్రత్యేకంగా ఇళ్ల కేటాయింపు ప్రక్రియను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
అర్బన్ ఏరియాల్లో జీ+3, జీ+4 నమూనాలో నిర్మాణం
నగర ప్రాంతాల్లో భూమి కొరతను దృష్టిలో ఉంచుకొని జీ ప్లస్ 3 మరియు జీ ప్లస్ 4 విధానంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు త్వరలోనే “ఇందిరమ్మ అర్బన్ హౌసింగ్ పాలసీ”ని ప్రకటించనున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ పాలసీ కింద హైదరాబాద్ ORR చుట్టూ నాలుగు ప్రాంతాలను గుర్తించామని, ఒక్కో చోట 8 వేల నుంచి 10 వేల ఇళ్ల వరకు నిర్మించే ప్రతిపాదన ఉందని మంత్రి చెప్పారు. పేదలు ప్రజలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాల్లోనే వారి జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా జీ+4 నమూనాలో ఇళ్లు నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన హామీ ఇచ్చారు.

