Tuesday, December 16, 2025
Homeస్పోర్ట్స్IPL 2026 Schedule : ఐపీఎల్ 2026 షెడ్యూల్ ఖరారు.. పూర్తి వివరాలు ఇవే..!!

IPL 2026 Schedule : ఐపీఎల్ 2026 షెడ్యూల్ ఖరారు.. పూర్తి వివరాలు ఇవే..!!

IPL 2026 Schedule : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రంగం సిద్ధం చేసింది. 2026 ఐపీఎల్ సీజన్‌ను మార్చి 26 నుంచి మే 31 వరకు నిర్వహించనున్నట్లు బీసీసీఐ ఫ్రాంచైజీలకు అధికారికంగా తెలియజేసింది. అబుదాబిలో నేడు (మంగళవారం) జరగనున్న ఆటగాళ్ల మినీ వేలానికి ముందు జరిగిన సమావేశంలో ఐపీఎల్ చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (సీడీవో) హేమంగ్ అమిన్ ఈ వివరాలు వెల్లడించినట్టు ‘క్రిక్‌బజ్’ కథనంలో పేర్కొంది.

డిఫెండింగ్ చాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తొలి మ్యాచ్‌తో ఈ సీజన్ ప్రారంభం కానుంది. అయితే, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహించడంపై ఇంకా స్పష్టత లేదు. గత టైటిల్ విజయోత్సవాల సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో స్టేడియం లభ్యతపై అనిశ్చితి నెలకొంది. భద్రతా ప్రమాణాలు పూర్తిగా పాటిస్తేనే మ్యాచ్‌లకు అనుమతిస్తామని కర్ణాటక ప్రభుత్వం షరతులతో కూడిన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇక నేడు అబుదాబిలోని ఎతిహాద్ ఎరీనాలో జరగనున్న మినీ వేలంలో 10 ఫ్రాంచైజీలు పాల్గొననున్నాయి. మొత్తం 77 స్లాట్‌ల కోసం 359 మంది ఆటగాళ్లు బరిలోకి దిగుతున్నారు. వీరిలో 31 మంది విదేశీ ఆటగాళ్లు ఉండటం విశేషం. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) అత్యధికంగా 13 స్లాట్‌లను భర్తీ చేయాల్సి ఉండగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) 10 స్లాట్‌లతో తర్వాతి స్థానంలో ఉంది.

ఈ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అతని కోసం రూ. 25 కోట్లకు పైగా ధర పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే లియామ్ లివింగ్‌స్టోన్, రవి బిష్ణోయ్ వంటి స్టార్ ఆటగాళ్లపై కూడా ఫ్రాంచైజీలు భారీ మొత్తాలు ఖర్చు చేసే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మొత్తంగా ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు నుంచే ఉత్కంఠ నెలకొనగా, నేటి మినీ వేలం లీగ్ రూపురేఖలను మార్చే కీలక ఘట్టంగా మారనుంది.

RELATED ARTICLES

Most Popular