land registration : ఆంధ్రప్రదేశ్‌లో తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూటమి ప్రభుత్వం గణనీయంగా సులభతరం చేసింది. గతంలో వీలునామా లేకుండా చనిపోయిన తల్లిదండ్రుల ఆస్తులను వారసులు పంచుకోవాలంటే తహసీల్దారు కార్యాలయంలో దరఖాస్తు చేసి, సంవత్సరాల తరబడి మ్యూటేషన్ కోసం ఎదురుచూడాల్సి వచ్చేది. ఈ జాప్యం వల్ల చిన్న, సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈ సమస్యకు శాశ్వత చెక్ పెట్టేందుకు రాష్ట్ర కూటమి ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ నెల (డిసెంబర్) 9వ తేదీ నుంచి ఈ కొత్త నియమాలు అమలులోకి వచ్చాయి.
కొత్త నియమాల ముఖ్యాంశాలు :
వీలునామా లేకుండా తల్లిదండ్రులు చనిపోతే, వారసులంతా లిఖితపూర్వకంగా ఏకాభిప్రాయంకి వస్తే చాలు.
ఆ ఏకాభిప్రాయ పత్రాన్ని (Partition Deed / Family Settlement Deed) తీసుకొని నేరుగా సబ్ రిజిస్ట్రారు కార్యాలయంలో రిజిస్టర్ చేసుకోవచ్చు.
రిజిస్ట్రేషన్ ఫీజు అతి తక్కువగా నిర్ణయించారు :
ఆస్తి రిజిస్ట్రేషన్ విలువ రూ.10 లక్షల లోపు ఉంటే – కేవలం రూ.100 మాత్రమే
రూ.10 లక్షలు దాటితే – రూ.1,000 మాత్రమే
రిజిస్ట్రేషన్ అనంతరం వెంటనే మ్యూటేషన్ కూడా స్వయంచాలకంగా జరుగుతుంది. ఇందుకోసం రిజిస్ట్రేషన్ సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన మార్పులు చేశారు. మంగళవారం (డిసెంబర్ 10) రాష్ట్రంలోని పలు సబ్ రిజిస్ట్రారు కార్యాలయాల్లో ఈ కొత్త విధానంలో మొదటి రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.

