Minister Komatireddy Venkata Reddy : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల చేసిన ‘తెలంగాణ నేతల నర దిష్టి’ వ్యాఖ్యలపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్ తన అవగాహన లేకుండా మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారని, వెంటనే క్షమాపణ చెప్పకపోతే అతని సినిమాలు తెలంగాణలో రిలీజ్ కావనివ్వనని హెచ్చరించారు.
కోనసీమ పచ్చదనం, రాష్ట్ర విభజన అంశాలపై మాట్లాడుతూ పవన్ కల్యాణ్ “తెలంగాణ నాయకుల దిష్టి వల్ల గోదావరి జిల్లాల్లో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి” అని చెప్పడంతో రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ ఉద్రిక్తత పెరిగింది. ఈ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని మంత్రి వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. “పవన్ కల్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలను అవమానిస్తే ఇలా ఊరుకోము. వెంటనే క్షమాపణలు చెప్తే, అతని సినిమాలు తెలంగాణలో కనీసం ఒకటి రెండు రోజులు ఆడతాయి. లేకపోతే, ఆయన సినిమాలు ఆడనివ్వం” అని స్పష్టంగా హెచ్చరించారు.
ఈ విషయంపై మంత్రి మీడియాతో మాట్లాడుతూ, “సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా.. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే అతని సినిమాలు తెలంగాణలో ఆడవు” అని ప్రత్యేకంగా పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ మీద ఒక్కసారిగా మూకుమ్మడి దాడికి దిగిన కాంగ్రెస్ మంత్రులు, ఈ వ్యాఖ్యలతో రాజకీయ దుమారం మరింత పెరిగింది. ఇది రెండు రాష్ట్రాల మధ్య సినిమా ఇండస్ట్రీకి కూడా ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ ఘటన ముందు, పవన్ కల్యాణ్ సినిమా ‘ఓజీ’కి తెలంగాణలో టిక్కెట్ రేట్లు పెంచినప్పటికీ, హైకోర్టు స్టే ఇచ్చిన సందర్భంలోనూ మంత్రి వెంకటరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసింది. పవన్ వ్యాఖ్యలు తెలివితక్కువ మాటలని బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కూడా విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా పవన్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఈ రాజకీయ ఉద్రిక్తత ఎలా ముగుస్తుందో చూడాలి.

