Mumbai train blast case : 2006 జులై 11న ముంబై సబ్‌అర్బన్ రైల్వే నెట్‌వర్క్‌లోని ఏడు లోకల్ ట్రైన్లలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో బాంబే హైకోర్టు సోమవారం (జులై 21) సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 12 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ వారి శిక్షలను రద్దు చేసింది. ప్రాసిక్యూషన్ తమ వాదనలను నిరూపించడంలో పూర్తిగా విఫలమైందని న్యాయమూర్తులు అనిల్ కిలోర్, శ్యామ్ చందక్‌లతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పులో పేర్కొంది. ఈ ఘటనలో 189 మంది మరణించగా, 800 మందికి పైగా గాయపడ్డారు.
2006 జులై 11 సాయంత్రం 6:23 నుంచి 6:28 గంటల మధ్య, ముంబై వెస్టర్న్ రైల్వే లైన్‌లోని ఖార్ రోడ్, సాంతాక్రూజ్, బాంద్రా, జోగేశ్వరి, మహీం జంక్షన్, మీరా రోడ్, భయాందర్, బోరివిలీ మధ్య ఏడు ఫస్ట్-క్లాస్ కంపార్ట్‌మెంట్లలో అత్యంత శక్తివంతమైన RDX బాంబులు పేలాయి. ఈ పేలుళ్లు గరిష్ట రద్దీ సమయంలో జరగడంతో విస్తృతంగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించింది. మహారాష్ట్ర యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS) ఈ కేసును విచారించి, మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA), అన్‌లాఫుల్ యాక్టివిటీస్ (ప్రివెన్షన్) యాక్ట్ (UAPA) కింద 13 మందిని అరెస్టు చేసింది. 15 మందిని వాంటెడ్‌గా ప్రకటించింది.
2015లో, ఎనిమిది సంవత్సరాల విచారణ తర్వాత, MCOCA స్పెషల్ కోర్టు 12 మందిని దోషులుగా తేల్చింది. వీరిలో ఐదుగురికి మరణశిక్ష, ఏడుగురికి జీవిత ఖైదు విధించింది. ఒక నిందితుడు, వాహిద్ షేక్, తొమ్మిది సంవత్సరాల జైలు శిక్ష అనుభవించిన తర్వాత నిర్దోషిగా విడుదలయ్యాడు. మరణశిక్ష పొందిన ఐదుగురిలో ఒకరైన కమల్ అన్సారీ 2021లో కోవిడ్-19తో నాగ్‌పూర్ జైలులో మరణించాడు.
హైకోర్టు తీర్పు : బాంబే హైకోర్టు స్పెషల్ బెంచ్, జులై 2024 నుంచి ఈ కేసుపై ఆరు నెలలపాటు విచారణ జరిపింది. నిందితుల తరపు న్యాయవాదులు సీనియర్ అడ్వకేట్ ఎస్. మురళీధర్, నిత్యా రామకృష్ణన్, యుగ్ మోహిత్ చౌదరి, పాయోషి రాయ్ తదితరులు వాదించారు. ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాలు, అరెస్టు సమయంలో తీసిన ఒప్పుకోలు పత్రాలు చట్టవిరుద్ధమని, వాటిని హింస, బెదిరింపుల ద్వారా సేకరించారని వాదించారు. టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ (TIP)లో అవలంబించిన విధానాలు సరైన అధికారం లేకుండా జరిగాయని, సాక్షుల వాంగ్మూలాలు విశ్వసనీయత లేనివని కోర్టు గుర్తించింది.
“ప్రాసిక్యూషన్ నిందితులపై నేరం నిరూపించడంలో పూర్తిగా విఫలమైంది. నిందితులు నేరం చేశారని నమ్మడం కష్టం. అందువల్ల వారి శిక్షను రద్దు చేస్తూ నిర్దోషులుగా ప్రకటిస్తున్నాం,” అని హైకోర్టు బెంచ్ తన తీర్పులో పేర్కొంది. నిందితులు ఇతర కేసుల్లో వాంటెడ్ కాకపోతే వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని, ఒక్కొక్కరూ రూ. 25,000 వ్యక్తిగత బాండ్‌పై విడుదల కావాలని కోర్టు ఆదేశించింది.

