Pension Cut : ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ప్రతినెలా 1వ తేదీన ఎనేటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ను భారీ ఎత్తున పంపిణీ చేస్తోంది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, తలసేమియా బాధితులు సహా మొత్తం 26 వర్గాలకు చెందిన లబ్ధిదారులకు రూ.4,000 నుంచి రూ.15,000 వరకు పెన్షన్ అందజేస్తున్నారు. అయితే ఈ పథకంలో లబ్ధిదారుల సంఖ్య క్రమంగా తగ్గుతూ రావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
నవంబరు నెలలో 63,38,744 మందికి పెన్షన్ అందినప్పటికీ, 1,74,701 మందికి పెన్షన్ ఇవ్వలేదు. డిసెంబరు 1న (నేడు) 63,25,999 మందికి మాత్రమే పెన్షన్ పంపిణీ జరిగింది – అంటే గత నెలతో పోలిస్తే కేవలం 12,745 మంది తగ్గారు. గతంలో పెన్షన్ ఆగిపోయిన వారిలో 12,745 మందిని మాత్రమే తొలగించగా, మిగిలిన సుమారు 1.62 లక్షల మంది ఇంకా జాబితాలోనే ఉన్నారని, వారి పెన్షన్‌ను ఆపేసినట్లు సమాచారం.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారం వదిలిన సమయంలో 66,34,372 మంది పెన్షనర్లు ఉండగా, ప్రస్తుతం అది 63,25,999కు చేరింది – అంటే 3,08,373 మంది పెన్షనర్ల పెన్షన్‌ను నిలిపివేసినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతినెలా పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య ఎందుకు తగ్గుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో పెన్షన్ పంపిణీలో తప్పనిసరిగా ప్రజాప్రతినిధులు పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినప్పటికీ, కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పటికీ పాల్గొనకపోవడంపై సీఎం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

