Pension : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులు, పింఛనర్లు మరియు వారి కుటుంబ సభ్యులకు (మొత్తం 24 లక్షల మంది లబ్ధిదారులు) అందుతున్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీం (EHS)లో ఎదురవుతున్న దీర్ఘకాల సమస్యలను పరిష్కరించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఉద్యోగ సంఘాలు ఈ పథకం సరిగా అమలు కావడం లేదని గొడవ చేస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత నెల 18న ఇచ్చిన హామీ మేరకు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇవాళ (శుక్రవారం) అధికారిక GO జారీ చేశారు.
EHS పథకం లోపాలను గుర్తించి, సమస్యలకు సత్వర పరిష్కార మార్గాలు సూచించేందుకు ప్రత్యేకంగా 7 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి సీఎస్ విజయానంద్ అధ్యక్షత వహిస్తారు. ఇతర సభ్యులు – GAD ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, డాక్టర్ NTR వైద్య సేవా ట్రస్ట్ సీఈవో, ఉద్యోగ సంఘాల నుంచి ఇద్దరు ప్రతినిధులు ఉంటారు. ఈ కమిటీ 8 వారాల్లో పథకం పటిష్ట అమలుకు సంబంధించి నివేదిక సమర్పించాల్సి ఉంది.
2013లో ప్రారంభమైన ఈ పథకంలో ప్రస్తుతం 5.53 లక్షల ఉద్యోగులు, 2.30 లక్షల పింఛనర్లు, 81 వేల కుటుంబ పింఛనర్లతో కలుపి మొత్తం 23.59 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఉద్యోగ సంఘాలు ప్రధానంగా లేవనెత్తిన సమస్యలు – బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం, ప్యాకేజీ రేట్లు పెంచకపోవడం, ఆసుపత్రుల నిరాసక్తత, ఆన్‌లైన్ పోర్టల్ పరిమితులు, పర్యవేక్షణ లోపం, ఫిర్యాదులు పరిష్కారం కాకపోవడం మొదలైనవి. ఈ కొత్త కమిటీ ద్వారా ఈ సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

