Rythu Bharosa : తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని నిలిపివేశారంటూ వస్తున్న వార్తలను ఖండించింది. ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జనవరి నెలలో నిధులు జమ చేస్తామని స్పష్టం చేసింది. అదేవిధంగా, పథకం అమలుపై ఎలాంటి షరతులు విధించలేదని ప్రభుత్వం తెలిపింది, దీంతో రైతుల్లో ఉన్న అనుమానాలను తొలగించే ప్రయత్నం చేసింది.ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ విభాగం ‘ఎక్స్’లో పోస్టు చేస్తూ, రైతు భరోసా కింద తెలంగాణ వ్యాప్తంగా 65 లక్షలకు పైగా రైతులు లబ్ధి పొందుతున్నారని వెల్లడించింది. పథకాన్ని నిలిపివేయడం లేదని, జిల్లా కమిటీలు క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నాయని, నిజమైన లబ్ధిదారులకు మాత్రమే సాయం అందేలా చూస్తున్నాయని స్పష్టం చేసింది.
ఆర్థిక శాఖ కూడా చెల్లింపుల కోసం జాబితాలను సిద్ధం చేసి తనిఖీ చేస్తోంది. వచ్చే నెల సంక్రాంతి తర్వాత అర్హులైన రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. శాటిలైట్ ఇమేజెస్ ద్వారా పంటల డేటాను సేకరిస్తున్నారు, జనవరి రెండో వారం వరకు వివరాలు సిద్ధం చేస్తున్నారు. పంటలు సాగు చేయని రైతులకు ఈసారి సాయం లభించకపోవచ్చు, అటువంటి భూములను మినహాయించే అవకాశం ఉంది, అభ్యంతరాలుంటే జిల్లా కలెక్టర్‌ను సంప్రదించవచ్చు.

