Tuesday, December 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Sankranti trains : అప్పుడే సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్‌.. పండక్కి ఇంటికి దారేది..?

Sankranti trains : అప్పుడే సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్‌.. పండక్కి ఇంటికి దారేది..?

Sankranti trains : తెలుగు వారికి అత్యంత ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి పండుగ ఒకటి. ముఖ్యంగా ఏపీ వారికి ఇది ప్రతిష్టాత్మక పండుగ. హైదరాబాద్‌ లో స్థిరపడిన ఏపీ వాసులు సంక్రాంతి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటారు. సంక్రాంతి పండుగకు ఆంధ్ర వాసులు ఊరెళ్లితే తెలంగాణ రాజధాని నగరం దాదాపు బోసిపోయి కనపడుతుంది. కాగా సంక్రాంతి కోసం పలువురు రెడు మూడు నెలల ముందుగానే తమ ప్రాంతాలకు రైళ్లలో బుకింగ్‌ చేసుకుంటారు. అయితే ఈసారి సంక్రాంతి పండుగకు రిజర్వేషన్‌ చేయించుకోవాలనుకున్న వారికి నిరాశే మిగిలింది.

నగరంలోని ముఖ్యమైన కాచిగూడ స్టేషన్‌ నుంచి వెళ్లే అన్ని రైళ్లలోనూ వెయిటింగ్‌ లిస్ట్‌లు కనబడుతున్నాయి. సంక్రాంతి పండుగను తమ సొంతూళ్లలో జరుపుకోవడానికి ఏపీ వాసులు రెండు నెలల ముందుగానే టిక్కెట్లను రిజర్వేషన్‌ చేయించుకున్నారు. దీంతో పండుగ రోజులైన 2026 జనవరి 13, 14, 15 తేదీల్లో మూడు రోజుల పాటు టిక్కెట్లు దొరకని పరిస్థితి. దీంతో చివరి నిమిషంలో ఎవరైనా టిక్కెట్లు రద్దు చేసుకుంటే తప్ప మిగిలిన వారికి టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో పండుగకు వెళ్లాలనుకున్న ఆంధ్రవాసులకు నిరాశే మిగిలింది.

ఏపీ రైళ్లకు పెరిగిన డిమాండ్‌

సంక్రాంతిని ఏపీలో ఘనంగా జరుపుకొంటారు. నగరంలో స్థిరపడ్డ ఆంధ్రవారు పండగను తమ స్వస్థలాల్లో కుటుంబ సభ్యులతో జరుపుకోవడానికి వెళుతుండటంతో రైళ్లకు డిమాండ్‌ పెరిగింది. ప్రైవేట్‌ ట్రావెల్స్, ఆర్టీసీ బస్సు ఛార్జీలతో పోల్చుకుంటే రైలు టిక్కెట్‌ ధరలు తక్కువే. అందుకే వారు రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. కాచిగూడ నుంచి నిత్యం పదుల సంఖ్యలో వివిధ ప్రాంతాలకు రైళ్లు వెళుతున్నప్పటికీ ఏపీలోని పలు నగరాలు, పట్టణాలకు వెళ్లే వాటికి మాత్రం ప్రాధాన్యత ఉంది. గుంటూరు, తెనాలి రేపల్లె డెల్టా, మహబూబ్‌నగర్‌-, కాచిగూడ్‌- విశాఖ ఎక్స్‌ప్రెస్‌తో పాటు కర్నూల్‌ మీదుగా రాకపోకలు సాగించే చెన్నై చెంగల్పట్టు, పుదుచ్చేరి, బెంగళూర్‌-అశోకపురం, చిత్తూరు వెంకటాద్రి, యశ్వంత్‌పూర్‌ తదితర రైళ్లలో పండుగకు ముందుగానే టిక్కెట్ల రిజర్వేషన్‌ అయిపోయింది .

అయితే కరోనా సమయంలో పలు రైళ్లను రద్దు చేశారు. వాటిలో కాచిగూడ్‌- టాటానగర్‌ రైలును నేటికీ పునరుద్ధరించలేదు. ఈ రైలు కాచిగూడ్‌ నుంచి గుంటూరు, విజయవాడ, ఏలూరు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పలాస మీదుగా టాటానగర్‌ వెళ్లేది.ఇది ఎక్కువ నగరాలను చుడుతూ వెళ్లేది. దీంతో ఈ రైలుకు నగరవాసుల నుంచి చాలా డిమాండ్‌ ఉండేది. ప్రత్యేక రైలుగా నడిపిన కాచిగూడ్‌-కాకినాడ రైలును కూడా నిలిపి వేశారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో టాటానగర్, కాకినాడ రైళ్లను పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

తాండూరు మీదుగా శబరిమలకు ప్రత్యేక రైళ్లు

ఇక ప్రస్తుతం అయ్యప్ప మాలదారులు శబరికి వేలాదిగా తరలివెళుతున్నారు. దానికోసం తాండూరు మీదుగా శబరిమలకు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వేశాఖ నిర్ణయించింది. సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి రైలు(07119) ఈనెల 17, 31వ తేదీల్లో బయలుదేరి వికారాబాద్, తాండూరు మీదుగా కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మళ్లీ రైలు(07120) ఈనెల 19, జనవరి 2వ తేదీల్లో కొల్లాం నుంచి సికింద్రాబాద్‌కు వస్తుంది. అయ్యప్ప దీక్షాపరులు ఈ విషయాన్ని గుర్తించి రైలు రిజర్వేషన్‌ చేయించుకునేవారు చేయించుకోవాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular