Smriti Mandhana Marriage Cancel : భారత మహిళల క్రికెట్ జట్టు వైస్-కెప్టెన్, స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తన వివాహం రద్దయినట్టు ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన స్మృతి, తన ప్రియుడు, సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్‌తో పెళ్లి చేసుకోవట్లేదని స్పష్టం చేసింది. గత కొన్ని వారాలుగా వ్యాప్తి చెందుతున్న రూమర్లకు తుది కొట్టిన ఈ ప్రకటన, ఇరు కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని ఫ్యాన్స్‌ను కోరింది.
నవంబర్ 23న స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్ మధ్య వివాహం జరగాల్సిన విషయం తెలిసిందే. అయితే, వివాహానికి ముందే స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన అనారోగ్యానికి గురవడంతో కుటుంబం ఆందోళన చెందింది. ఆ మరుసటి రోజు పలాశ్ కూడా అస్వస్థతకు గురై ఆసుపత్రికి చేరారు. ఈ పరిస్థితుల వల్ల వివాహాన్ని వాయిదా వేశారు. అయితే, ఈ విషయం తెలిసిన తర్వాత సోషల్ మీడియాలో వివిధ రూమర్లు వ్యాప్తి చెందాయి.
ఈ క్రమంలోనే పలాశ్ ముచ్చల్ వేరే అమ్మాయితో చేసిన చాట్‌లు వైరల్ అవ్వడంతో విషయం మరింత హాట్ టాపిక్ అయింది. ఇది చీటింగ్ అలెగేషన్లకు దారితీసింది. స్మృతి తన సోషల్ మీడియా ఖాతాల నుంచి ఎంగేజ్‌మెంట్, వివాహానికి సంబంధించిన అన్ని వీడియోలు, ఫోటోలు తొలగించడంతో ‘పెళ్లి రద్దు’ అనే వార్తలకు బలం చేకూరింది. ఆమె స్నేహితురాలు, భారత జట్టు సహచరులు శ్రేయాంక పటేల్, జెమీమా రాడ్రిగస్ కూడా వేడుకలకు సంబంధించిన పోస్ట్‌లు డిలీట్ చేశారు. ఈ అంశాలు మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమయ్యాయి.
ఈ ప్రచారాలపై స్మృతి మంధాన తన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ లేఖ రాసింది. “గత కొన్ని వారాలుగా నా జీవితంపై ఎన్నో వదంతులు వస్తున్నాయి. నేను వ్యక్తిగత జీవితాన్ని బయటి ప్రపంచానికి చూపించడానికి ఇష్టపడను. కానీ ఇప్పుడు స్పందించాల్సిన సమయం వచ్చింది. నా పెళ్లి క్యాన్సిల్ అయింది. ఈ విషయంపై క్లారిటీ ఇస్తున్నా. పలాశ్‌ను నేను పెళ్లి చేసుకోవట్లేదు. ఈ విషయం ఇంతటితో వదిలేస్తున్నా. మీరూ నాలాగే చేయండి. ఇరు కుటుంబాల ప్రైవసీని అందరూ గౌరవించాలని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇండియా తరఫున ఆడుతూ ఎన్నో ట్రోఫీలను గెలవడమే నా ముఖ్య లక్ష్యం” అని ఆమె పోస్ట్‌లో పేర్కొంది.

