Special Trains : దక్షిణ మధ్య రైల్వే క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగల నేపథ్యంలో ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు భారీ గుడ్‌న్యూస్ ఇచ్చింది. డిసెంబర్-జనవరి నెలల్లో రద్దీ దృష్ట్యా మొత్తం 42 ప్రత్యేక రైళ్లను వివిధ గమ్యాలకు నడపనుంది. ఇందులో చర్లపల్లి-బ్రహ్మపూర్, చర్లపల్లి-అనకాపల్లి, జాల్నా-ఛప్రా మార్గాల్లో వీక్లీ ప్రత్యేక రైళ్లు ప్రధానమైనవి.
చర్లపల్లి-బ్రహ్మపూర్ (07027) ప్రతి శుక్రవారం (డిసెంబర్ 12 నుంచి జనవరి 30 వరకు), బ్రహ్మపూర్-చర్లపల్లి (07028) ప్రతి శనివారం (డిసెంబర్ 6 నుంచి జనవరి 31 వరకు), చర్లపల్లి-అనకాపల్లి (07035) ప్రతి శనివారం, అనకాపల్లి-చర్లపల్లి (07036) ప్రతి ఆదివారం నడపనున్నారు. అలాగే జాల్నా-ఛప్రా (07651) ప్రతి బుధవారం, ఛప్రా-జాల్నా (07652) ప్రతి శుక్రవారం సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
సికింద్రాబాద్-అనకాపల్లి మార్గంలో మరో 34 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్-అనకాపల్లి (07055) ప్రతి గురువారం (డిసెంబర్ 4 నుంచి మార్చి 26, 2026 వరకు), అనకాపల్లి-సికింద్రాబాద్ (07056) ప్రతి శుక్రవారం (డిసెంబర్ 5 నుంచి మార్చి 27, 2026 వరకు) నడుస్తాయి. ఈ రైళ్లు చర్లపల్లి, నల్గొండ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, తుని తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతాయి.
ఇదే సమయంలో తిరుపతి-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (20701/20702)కు శాశ్వతంగా నాలుగు అదనపు ఏసీ చైర్‌కార్ కోచ్‌లు జతచేశారు. ఇప్పుడు మొత్తం 18 చైర్‌కార్ కోచ్‌లు (ప్లస్ 2 ఎగ్జిక్యూటివ్ కోచ్‌లు) ఉంటాయి. ఈ అదనపు కోచ్‌లు నవంబర్ 26 (బుధవారం) నుంచి అందుబాటులోకి వచ్చాయి.

