Telangana Job Calendar : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల విజయోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి త్వరలోనే ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) వేదికగా జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించనున్నారు. ఈ నెల 7న ఓయూలో జరగనున్న ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు సభలో ఈ ప్రకటన జరిగే అవకాశం ఉంది. ఈ సభను ఆర్ట్స్ కళాశాల ఎదురుగా నిర్వహించేందుకు ఓయూ వీసీ డా. కుమార్ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
రాష్ట్రంలో ఖాళీల భర్తీపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో 1,623 స్పెషలిస్ట్ పోస్టులు, TSLPRB ఆధ్వర్యంలో 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఖాళీలకు నోటిఫికేషన్లు విడుదల చేసిన ప్రభుత్వం, మహిళా అభివృద్ధి శాఖలో 14,468 మరియు రవాణా శాఖలో 3,038 ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతోంది. మొత్తంగా 40 వేల ఉద్యోగాల భర్తీకి ఈ జాబ్ క్యాలెండర్ మార్గదర్శకంగా పనిచేస్తుందని అధికారిక వర్గాలు తెలిపాయి.
విశ్వవిద్యాలయాల అభివృద్ధికి పెద్ద నిధులు
రేవంత్ రెడ్డి ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నారు. తొలి విడతలో ఓయూకు రూ. 1,000 కోట్లు, కాకతీయ విశ్వవిద్యాలయానికి రూ. 500 కోట్లు కేటాయించే ప్రతిపాదనలు ముందుకు ఉన్నాయి. మిగతా విశ్వవిద్యాలయాలకు కూడా తగిన నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ క్రమంలో, ప్రభుత్వ సలహాదారు కె. కేశవ రావు నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ, హయ్యర్ ఎడ్యుకేషన్, టెక్నికల్ మరియు స్కూల్ ఎడ్యుకేషన్‌లో చేపట్టాల్సిన సంస్కరణలపై అధ్యయనం పూర్తి చేసింది.
తెలంగాణ రైజింగ్ 2047 : ఎడ్యుకేషన్ రూట్‌మ్యాప్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ‘తెలంగాణ రైజింగ్ 2047’ దార్శనిక పటంలో ఎడ్యుకేషన్ సంస్కరణలపై రూట్‌మ్యాప్‌ను కూడా ఈ సభలో విడుదల చేసే అవకాశం ఉంది. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర విద్యార్థులను తీర్చిదిద్ధుగా తయారు చేయాల్సిన విధానాలు, మార్గదర్శకాలు ప్రస్తావించనున్నారు. ఓయూను ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయంగా నిలబెట్టేందుకు ప్రతిపాదనలు ఏర్పాటులో భాగంగా, హాస్టళ్లు, డిజిటల్ లైబ్రరీల ప్రారంభాలు జరుగుతున్నాయి.

